Politics

కుటుంబంతో గడిపితే ఒత్తిడి దూరం

కుటుంబంతో గడిపితే ఒత్తిడి దూరం

సమాజానికి దూరమవ్వడం వల్లే ఆత్మహత్యలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వరంగల్‌: పత్రికలు తిరగేస్తే యువతీయువకుల ఆత్మహత్యల వార్తలు కనిపిస్తున్నాయని, దీనికి ఒత్తిడి కారణం అని చెబుతున్నారని, యువత సమాజానికి దూరమవ్వడం వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సమాజానికి దూరం కాకుండా, నిత్యం శారీరక శ్రమ చేస్తూ కుటుంబంతో గడిపితే ఒత్తిడి ఉండదన్నారు. శనివారం హనుమకొండలోని చైతన్య డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను మాతృభాషలో మొదలుపెట్టాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అధ్యాపకుల తీరు కూడా ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకొని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆట ఆడాలని సూచించారు. తనకు 74 ఏళ్లు అని, దిల్లీలో ఉంటే నిత్యం గంటసేపు బ్యాడ్మింటన్‌ ఆడతానని వెంకయ్యనాయుడు తెలిపారు. కొన్ని రాజకీయ శక్తులు కులం, మతాల పేరుతో సమాజాన్ని వేరు చేయాలని చూస్తున్నాయని, యువత రాజకీయాల్లోకి వచ్చి నమ్మిన సిద్ధాంతం వదలకుండా ఓపికతో ఉండి సమాజాన్ని మార్చాలన్నారు. అనంతరం 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 912 మందికి డిగ్రీ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి, నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.వి.రమణారావు, చైతన్య వర్సిటీ కులపతి డాక్టర్‌ సి.హెచ్‌.వి.పురుషోత్తంరెడ్డి, ఉపకులపతి ఆచార్య జి.దామోదర్‌, రిజిస్ట్రార్‌ ఎం.రవీందర్‌ పాల్గొన్నారు.