Politics

సీఎం కావడానికి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారా?

సీఎం కావడానికి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారా?

పుంగనూరులో యువ గళం పర్యటనలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నారా లోకేష్ టార్గెట్ చేశారు.పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెల్లితే సీఎం కుర్చీలో కూర్చోవాలని పెద్దిరెడ్డి ఎదురు చూస్తున్నారని లోకేష్ అన్నారు.జగన్ జైలుకెళితే ఎవరు సీఎం అవుతారని వైసీపీలో చర్చ నడుస్తోందని లోకేష్ అన్నారు.
మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉండి కూడా పెద్దిరెడ్డి చిత్తూరుకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు.
జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన జిల్లా ఏదైనా ఉందంటే అది చిత్తూరు మాత్రమేనని,పెద్దిరెడ్డి సీనియర్ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు కనీసం పరిశ్రమలు రావడానికి ఎందుకు ప్రయత్నించలేకపోయారని లోకేష్ ప్రశ్నించారు.పెద్దిరెడ్డి గూండాయిజం కారణంగానే పారిశ్రామిక వేత్తలు జిల్లాలో తమ ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు భయపడుతున్నారని ఆరోపించారు.చిత్తూరును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని,పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీల ఏర్పాటుకు హామీ ఇవ్వడంతోపాటు యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తానని ప్రకటించారు. వెనుకబడిన వర్గాలే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు.స్వయం ఉపాధి కోసం ప్రజలకు సాధికారత కల్పించడంపై టీడీపీ దృష్టి సారిస్తుందని తెలిపారు.నియోజకవర్గంలోని టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్న పెద్దిరెడ్డి అనుచరులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే చల్లా రామచంద్రారెడ్డికి ఓటు వేయాలని నియోజకవర్గంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.