Devotional

కాణి పాకంలో ఉదయాస్తమయ సేవ ప్రారంభం

కాణి పాకంలో ఉదయాస్తమయ సేవ ప్రారంభం

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయాస్తమయ సేవను ఆదివారం వేకువ జామున శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. ఈ సేవకోసం భక్తులు రూ.లక్ష చెల్లించి టికెట్టు పొందవలసి ఉంటుంది. సేవకు ఇద్దరిని అనుమతిస్తారు. టికెట్టు పొందిన వారు ప్రధాన ఆలయంలో ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే 13 రకాల ఆర్జిత సేవలలో పాల్గొనవచ్చని పాలక మండలి మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. సేవలో పాల్గొనే భక్తులకు స్వామి శేషవస్త్రం, రవికతో పాటు ఉదయం పులిహోర, చక్కర పొంగళి, ఒక పెద్ద లడ్డూ, మూడు చిన్న లడ్డూలు, మూడు వడలుఅందిస్తారు. రెండు రోజుల పాటు ఒక ఏసీ గదిని కేటాయిస్తారు. వీరికి సహయకుడిగా ఆలయం తరపున ఓ ఉద్యోగిని నియమిస్తారు. ఈ సేవను భక్తులు సంవత్సరంలో ఒక్క రోజు చొప్పున పది సంవత్సరాల పాటు నిర్వహించుకోవచ్చు. ఆలయంలో నూతనంగా ప్రారంభించిన ఈ సేవా టికెట్టును మొట్టమొదటగా పూతలపట్టు మండలం పాలకూరుకు చెందిన జీవరత్నంరెడ్డి, తిరుపతికి చెందిన రామచంద్రారెడ్డి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి, పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.