ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనాలంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించాల్సిందే. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. మార్చి 31 తరువాత బంగారం కొనుగోలు నిబంధనలలో కొన్ని మార్పులు రానున్నాయి. ఆరు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య HUID (యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్) లేకుండా హాల్ మార్క్ చేసిన బంగారు అభరణాలు, కళాఖండాల విక్రయాన్ని ఏప్రిల్ 1 నుంచి నిషేధించినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కార్యకలాపాలపై సమీక్షించిన కేంద్రమంత్రి పియూష్ గోయల్.. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల HUID కలిగిన బంగారాన్ని మాత్రమే విక్రయించాలని ఆదేశించారు.
వ్యాపారులు, కస్టమర్లు దీన్ని తప్పక పాటించాలని పియూష్ గోయల్ సూచించారు. హెచ్‌యూఐడీ అనేది నంబర్లు, అక్షరాలతో కూడిన 6 అంకెల కోడ్. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి ఓ ప్రత్యేకమైన హెచ్‌యూఐడీ కోడ్ కేటాయిస్తారు. దీనిని లేజర్‌తో చెక్కుతారు. ఈ నంబరు బీఐఎస్ డేటాలో భద్రపరుస్తారు. దేశంలో నకిలీ ఆభరణాల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.