నగర శివారులో ఇటీవల జరిగిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల జాబితాలో హరిహరకృష్ణ స్నేహితురాలి పేరును కూడా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చేర్చారు.యువతి కోసమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు నిర్ధారించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా యువతిపై కేసు నమోదు చేశారు. ఏ2గా హసన్, ఏ3గా యువతి పేరును చేర్చి.. ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
సోమవారం డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. ” ఫిబ్రవరి 17వ తేదీన నవీన్‌ను హరిహరకృష్ణ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేశాడు. వాటిని సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అవయవాలను హసన్‌తో కలిసి మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు. అక్కడి నుంచి హసన్ ఇంటికి చేరుకొని దుస్తులను మార్చుకొని రాత్రి అక్కడే ఉండి, 18వ తేదీ ఉదయం బీఎన్‌రెడ్డి నగర్లో ఉండే స్నేహితురాలి దగ్గరికి వెళ్లాడు. ఆమెకు నవీన్‌ను హత్య చేసిన విషయం చెప్పి.. ఖర్చుల కోసం రూ.1500 తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఫోన్లో వారిద్దరితో సంప్రదింపులు జరిపాడు. 20వ తేదీ సాయంత్రం మరోసారి స్నేహితురాలి దగ్గరికి వెళ్లి.. ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు” అని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
21వ తేదీ నవీన్ కుటుంబ సభ్యులు హరిహరకృష్ణకు ఫోన్ చేసి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయినట్లు సాయిశ్రీ మీడియాకు తెలిపారు. ” ఖమ్మం, విజయవాడ,విశాఖలో తలదాచుకొని, 23న వరంగల్‌లోని తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు హరిహరకృష్ణ కోసం గాలిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో.. వెంటనే పోలీసులకు లొంగి పోవాల్సిందిగా కుమారుడికి సూచించాడు. 24న హరిహర కృష్ణ హైదరాబాద్ వచ్చి హసన్ దగ్గరికి వెళ్లాడు. హసన్, హరిహర కృష్ణ ఇద్దరూ కలిసి మన్నెగూడలో నవీన్ శరీర అవయవాలు పడేసిన ప్రాంతానికి వెళ్లారు. వాటిని తిరిగి తీసుకొని హత్య చేసిన ప్రదేశానికి వచ్చి తగులబెట్టారు. ఆ తర్వాత స్నేహితురాలి ఇంటికి వెళ్లి స్నానం చేశారు. ఆ సమయంలో స్నేహితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అక్కడి నుంచి బయల్దేరిన హరిహరకృష్ణ నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు” అని డీసీపీ వివరించారు