Politics

తుమ్మలకు కొత్త ఆఫర్ – షర్మిలపై అభ్యర్ధి ఫిక్స్..!!

తుమ్మలకు కొత్త ఆఫర్ – షర్మిలపై అభ్యర్ధి ఫిక్స్..!!

తుమ్మలకు కొత్త ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలపైన పాలేరులో బీఆర్ఎస్ కూటమి అభ్యర్ది ఖరారయ్యారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పార్టీకి దూరమయ్యారు. ఏ పార్టీలో చేరేదీ అధికారికంగా ప్రకటించలేదు. మరో సీనియర్ నేత తుమ్మలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మూడు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒక స్థానం సీనియర్ నేత తుమ్మలకు ఇవ్వనున్నట్లు సమాచారం. తుమ్మలను అందుబాటులో ఉండాలని సమాచారం అందింది. ఇదే సమయంలో పాలేరు నుంచి తొలి సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న వైఎస్ షర్మిల పైన అభ్యర్ధి దాదాపు ఖరారయ్యారు.

తుమ్మలకు ఎమ్మెల్సీ దక్కే ఛాన్స్.. మాజీ మంత్రి..సీనియర్ నేత తుమ్మలను పెద్దల సభకు పంపాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా ప్రచారం సాగుతోంది. తుమ్మలను రేపు హైదరాబాద్ రావాల్సిందిగా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఖమ్మంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సదస్సుకు ముందు జరిగిన చర్చల సమయంలో ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న స్థానాల్లో తుమ్మలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, తుమ్మల ఎమ్మెల్సీ పదవి పైన ఆసక్తి లేరని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలనేది తుమ్మల ఆలోచనగా తెలుస్తోంది. ఇదే అంశం పైన తనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన సమయంలోనే స్పష్టత ఇచ్చారని సమాచారం. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా తుమ్మలకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం దాదాపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం నుంచి ఆహ్వానం రావటంలో తుమ్మల నిర్ణయం కీలకం కానుంది.

ఖమ్మం జిల్లాలో పార్టీ వ్యవహారాలపై

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ముందుగా తుమ్మలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తుమ్మల 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన కందాల టీఆర్ఎస్ కు దగ్గరయ్యారు. ఇదే సమయంలో మరో సీనియర్ నేత పొంగులేటి పార్టీ వీడినట్లే. జిల్లాలో నేతల మధ్య సఖ్యత కుదిర్చే క్రమంలో ముందుగానే పదవుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. తుమ్మలను ఒప్పించి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం ద్వారా స్థానికంగా ఉన్న విభేదాలకు ముగింపు పలకాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. తుమ్మల తాను పాలేరు నుంచి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో, ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం ఏంటనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది.

పాలేరు నుంచి అభ్యర్ధి ఖరారు

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ – వామపక్షాల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. పాలేరు సీటును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేటాయిస్తారని సమాచారం. తమ్మినేని పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుకుంటుండటంతో ఆయనకు ఆ సీటు ఖాయమని తెలుస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లొ పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసారు. అదే సమయంలో జిల్లాలో పొంగులేటి కూడా షర్మిల పార్టీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో షర్మిల వర్సస్ సీపీఎం నేత తమ్మినేని మధ్య పాలేరు అసెంబ్లీ బరిలో పోరు తప్పేలా లేదు. వామపక్ష పార్టీలతో పొత్తు. .ఖమ్మంలో ఎన్నికల వేళ వివాదాల సర్దుబాటులో భాగంగా తుమ్మలకు ఎమ్మెల్సీ సీటు నిర్ణయం కీలకంగా మారుతోంది. ఈ మొత్తానికి సంబంధించి ఈ రోజు లేదా రేపు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.