NRI-NRT

ఆస్కార్ వెనుక. కార్తికేయ. దానయ్య. ఏరి? ఎక్కడ??

ఆస్కార్ వెనుక. కార్తికేయ. దానయ్య. ఏరి? ఎక్కడ??

ఆస్కార్ వెనుక కార్తికేయ
★ ఎవరూ గుర్తించని వైనం
★ నిర్మాత దానయ్య ఎక్కడ.?
★ మయా ప్రపంచంలో మరుగున పడిన వాస్తవాలు

గమ్మత్తైన విషయం ఏమిటంటే..? తెల్ల వాడిని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లను భారతీయుడు చిత్రంగా నిర్మిస్తే… ఆ చిత్రానికి అదే తెల్లవాడే ‘ఆస్కార్ అవార్డ్’ ఇవ్వడం మన భారతీయులకు గర్వకారణం… మేరా భారత్ మహాన్. మరుగున పడిన మరో గమ్మత్తైన కథనం ఇది.

ఆస్కార్ అవార్డు అసలు విజేత కార్తికేయ..:
కీరవాణికి నిజం తెలుసు.! నిజం చెప్పడానికి కూడా సందేహించడు.! అంతటి ఆస్కార్ వేదిక మీద తనకు ఈ అవార్డు దక్కడానికి కారణమైన వ్యక్తి పేరు ప్రస్తావించాడు. ఇంకెవరి పేరునూ ప్రస్తావించలేదు. ఆ వ్యక్తి ఎవరంటే..? కార్తికేయ..!

ఎవరు ఈ కార్తికేయ..?:
ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా జూనియర్ ఎన్టీయార్ ‘తన పేరు ప్రస్తావిస్తూ కార్యశూరుడు, వెంటపడతాడు’ అని అభినందించాడు ఒకరకంగా…! ఈ కార్తికేయ రాజమౌళి దత్త పుత్రుడు. రాజమౌళి భార్య రమ మొదటి సంబంధం ద్వారా కలిగిన కొడుకు. ఆమె రాజమౌళిని పెళ్లి చేసుకున్నాక కార్తికేయను దత్తత తీసుకున్నాడు. కార్తికేయ కూడా రాజమౌళిని అప్పా అని పిలుస్తాడు.(‘రమ, రాజమౌళి దంపతులు మయూఖ’ అనే అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. కార్తికేయ పెళ్లి చేసుకున్నామె పేరు పూజా ప్రసాద్. జగపతిబాబు మేనకోడలు, నిర్మాత గుణ్నం గంగరాజు ఆమెకు కజిన్.!)

ఇదీ కార్తికేయ నేపథ్యం..: ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కథ రచన మొదలుకొని, ఆస్కార్ అవార్డు గెలుపు దాకా.. ప్రతి దశలోనూ కార్తికేయ తెలివితేటలే పనిచేశాయి. ఆర్ఆర్ఆర్ మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు సహా ఇప్పుడు ఆస్కార్ అవార్డు పొందడానికి తగిన కార్యాచరణ మొత్తం ఆర్గనైజ్ చేసింది కార్తికేయ. తను మార్కెటింగ్ జీనియస్… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు వెన్నెముక.

డిఫరెంట్ కారెక్టర్..:
ఇండస్ట్రీలో వినిపించే చిన్నా,చితకా విమర్శలు, గాసిప్స్ జోలికి పోడు, తెరపైకి రాడు… చేయాల్సిన పనిని నిశ్శబ్దంగా తెర వెనుక ఉండి చక్కబెడతాడు. తెర మీద కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, రాంచరణ్, జూనియర్ తదితరులు కనిపిస్తుంటారు. ప్రత్యేకించి ఈ క్రెడిట్ బాగా ఉపయోగపడింది చంద్రబోస్‌కు, కీరవాణికి.

దటీజ్ కార్తికేయ…:
ఆస్కార్ అవార్డుకు కారణభూతుడు కార్తికేయే, తను లేకపోతే అవార్డు లేదు, ఆ ముంగిట్లోకి అడుగుపెట్టేవాళ్లే కాదు. దటీజ్ కార్తికేయ… తనకూ కొడుకు వరసే అయినా కీరవాణి కార్తికేయ కృషిని గుర్తించి, ఆ వేదిక మీద ప్రస్తావించింది అందుకే… నాటునాటును మించిన మోటు పాటలు, నీటు పాటలు ప్రపంచవ్యాప్తంగా రాక కాదు, లేక కాదు.! సరిగ్గా మార్కెటింగ్ చేసుకోగలగాలి. అలాంటి విషయాల్లో దిట్ట కార్తికేయ. సో, నిజంగా ఈ ఆస్కార్ అవార్డు పట్ల అభినందించాల్సింది తననే.!

రమా.. గర్వించు తల్లీ:
కార్తికేయకు ఓ విజన్ ఉంది… ప్రపంచ సినిమారంగం ఆనుపానులను ఔపోసన పట్టినవాడు… ఇక్కడ ఎంత డబ్బు ఖర్చయిందనేది ముఖ్యం కాదు… ఆ లెక్కన కేజీఎఫ్ వాళ్లు పెట్టలేరా..? కానీ అవార్డు కొట్టే దిశలో సరిగ్గా పట్టువదలక సరైన మార్గాల్లో ప్రయత్నించేవాడు అవసరం… ఆ పని చేసిపెట్టింది కార్తికేయ… సో, అధికంగా గర్వించాల్సింది రాజమౌళి భార్య రమ…!!

ఇది తొలి అవార్డు కాదు..:
అందరూ ఇదే ఇలాంటి అవార్డు పొందిన తొలి భారతీయ సినిమా అన్నట్టుగా దునియా ప్రచారం చేస్తున్నారు. కానీ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను జయహో పాట రాసిన గుల్జార్, సంగీతానికి- బెస్ట్ స్కోర్‌కు గాను రెహమాన్‌కు, సౌండ్ మిక్సింగుకు రెసూల్ పుకుట్టిలకు కూడా ఆస్కార్ వచ్చింది.

బాక్స్:
దారిన పోయే దానయ్య:
ఆస్కార్ అవార్డుల లాబీయింగులో, ఈ ఘనతలో ఎక్కడా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య పేరే వినిపించలేదు. మొదట్లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పేరు గానీ, లిరిక్ రైటర్ చంద్రబోస్ పేరు గానీ వినిపించలేదు. సోషల్ మీడియా బూతులు తిట్టాక వాళ్లనూ ఇన్వాల్వ్ చేశారు. ఒక వ్యాఖ్య తెలుగు నెటిజన్ల మధ్య బాగా సర్క్యులేటవుతోంది. ‘రాజమౌళి విజన్, కీరవాణి ట్యూన్, చంద్రబోస్ లిరిక్, ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీ, జూనియర్ ఎన్టీయార్-రాంచరణ్ స్టెప్పులకు మోకరిల్లిన ఆస్కార్’.. (ఫాఫం, ఈ ప్రచారంలోనూ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ మీద వివక్ష..)

బాక్స్:

‘నాటు నాటు’కు ఆస్కార్‌..
2023 ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ‘నాటు నాటు…’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’కు ఆస్కార్‌ దక్కించుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ ప్రకటించగానే డాల్బీ థియేటర్‌ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్‌ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది.

■ భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్‌.. బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయ చిత్రం తొలి అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మనదేశం నుంచి నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ మేరకు దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న.. అవార్డులను అందుకున్నారు.