Sports

పంత్ ను కలిసిన యువీ.. చాంపియన్ మళ్లీ ఎగరబోతున్నాడని కామెంట్

పంత్ ను కలిసిన యువీ.. చాంపియన్ మళ్లీ ఎగరబోతున్నాడని కామెంట్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్,వేగంగా కోలుకుంటున్న భారత క్రికెటర్
ఐపీఎల్ తో పాటు ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నకు దూరం.

కారు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. కాళ్లతో పాటు పలు శరీర భాగాలకు తీవ్ర గాయాలకు శస్త్ర చికిత్సలు కావడంతో నెలకు పైగా ఆసుపత్రిలో ఉన్న పంత్ ఈ మధ్యే ఇంటికి చేరుకున్నాడు. ఊతకర్ర సాయంతో నడుస్తున్నాడు. ఈ మధ్యే స్విమ్మింగ్ పూల్ లో నెమ్మదిగా అడుగు వేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. పంత్ ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించాడు. పంత్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పంత్ తిరిగి జట్టులోకి వస్తాడని అన్నాడు. పంత్‌ను కలిసి, హాయిగా నవ్వుకున్నట్టు తెలిపాడు.

‘బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ చాంపియన్ మళ్లీ ఎగరబోతున్నాడు. పంత్ ను కలవడం, అతనితో నవ్వుకోవడం బాగుంది. ఎప్పట్లాగే అతను సానుకూలంగా, ఫన్నీగా ఉన్నాడు. అతనికి భగవంతుడు మరింత శక్తినివ్వాలి’ అని యువరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. కాగా, పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనే అవకాశం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ కు బాధ్యతలు అప్పగించారు. తమ జట్టు పంత్ సేవలను కోల్పోతుందని వార్నర్ చెప్పాడు.