Movies

ఢిల్లీలో రామ్ చరణ్కు ఘన స్వాగతం, నేడు ప్రధాని మోడీతో భేటీ

ఢిల్లీలో రామ్ చరణ్కు ఘన స్వాగతం, నేడు ప్రధాని మోడీతో  భేటీ

ఆస్కార్ వేడుకల తర్వాత రామ్ చరణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద రామ్ చరణ్ రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అభిమానులు. రామ్ చరణ్ రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చకున్నారు రామ్ చరణ్. ‘ఆస్కార్’ వేడుకల్లో తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకట్టుకున్నారు. ఆస్కార్ వేడుకలకు ముందే అమెరికా వెళ్లిన చరణ్ అక్కడ వరుసగా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా అందుకున్నారు. ఇక ఆస్కార్ వేడుకల్లో సతీమణి ఉపాసనతో కలసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుక తర్వాత మూవీ టీమ్ అంతా హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో లాండ్ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద రామ్ చరణ్ రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అభిమానులు. వేలాదిగా మెగా అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ఆర్ఆర్ఆర్ బ్యానర్లు, చరణ్ ఫ్లెక్సీలు పట్టుకొని రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు. చరణ్ అభిమానులతో కలసి సెల్ఫీలు కూడా దిగారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఢిల్లీ విమానాశ్రయం వద్ద రామ్ చరణ్ మాట్లాడారు. ఆస్కార్ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక నుంచి ‘నాటు నాటు’ పాట మాస్ సాంగ్ కాదని, ఇది ప్రజల అందరి పాటని వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందని, మూవీ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలపుతున్నానన్నారు రామ్ చరణ్. ఢిల్లీ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఈ రోజంతా బిజీబిజీగా గడపనున్నారు. ఆయన సాయంత్రం ప్రధాని మోడీను కూడా కలవనున్నారు. అలాగే ఈరోజు ‘ఇండియా టుడే కాంక్లేవ్’ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఢిల్లీలో జరగనున్నఈ ఈవెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, క్రికెటర్ సచిన్ లతో పాటు రామ్ చరణ్ కూడా అతిథిగా పాల్గొన్నున్నారు. అలాగే జాన్వీ కపూర్, మలైకా అరోరా ఇలా ఒక్కోరంగం నుంచి ప్రముఖ వ్యక్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ ప్రధాని మోడీతో భేటీ పై కూడా రామ్ చరణ్ అభిమానులు ఆరా తీస్తున్నారు. చరణ్ ప్రత్యేకంగా మోడీను కలవడం వెనుక ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా రామ్ చరణ్, ప్రధాని మోడీ భేటీ ఇటు ఇండస్ట్రీలోనూ అటు రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. ఇక రామ్ చరణ్ ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన రెగ్యులర్ షూటింగ్ లలో పాల్గొననున్నారు. ఆయన ప్రస్తుతం దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘ఆర్ సి 15’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.