శ్రీగిరిపై ఉగాది ఉత్సవాలు
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉగాది మహోత్సవాలు 23న ముగియనున్నాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ నిర్వహణలో భాగంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా యాగశాల ప్రవేశం చేశారు. తరువాత వేదపండితులు చతుర్వేద పారాయణాలతో వేదస్వస్తి నిర్వహించారు. ఆ తరువాత దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని ఆలయ అర్చకులు, వేదపండితులు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి పూజలు నిర్వహించి, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ చేశారు. ఉత్సవాలు క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివ పరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో జరుగుతుండడంతో ప్రతేక పూజలు నిర్వహించారు.