NRI-NRT

కెనడాలో ఘోరం.. అందరూ చూస్తుండగా భారతీయ విద్యార్ధిపై దాడి.. నడిరోడ్డుపై దారుణంగా కొట్టి ఆపై..!

కెనడాలో ఘోరం.. అందరూ చూస్తుండగా భారతీయ విద్యార్ధిపై దాడి.. నడిరోడ్డుపై దారుణంగా కొట్టి ఆపై..!

కెనడాలో (Canada) దారుణం జరిగింది. భారత్‌కు చెందిన ఓ సిక్కు విద్యార్థిపై కొందరు గుర్తు తెలియని దుండగులు జాత్యహంకార దాడికి పాల్పడ్డారు.

ఎన్నారై డెస్క్: కెనడాలో (Canada) దారుణం జరిగింది. భారత్‌కు చెందిన ఓ సిక్కు విద్యార్థిపై కొందరు గుర్తు తెలియని దుండగులు జాత్యహంకార దాడికి పాల్పడ్డారు. బ్రిటీష్ కొలంబియాలో (British Columbia) ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు విద్యార్ధి తలపాగాను చింపి (Turban Ripped Off), రోడ్డుపై కొట్టిపారేశారు. బాధితుడిని గగన్‌దీప్‌ సింగ్‌గా(Gagandeep Singh) గుర్తించారు. గత శుక్రవారం రాత్రి కిరాణ సామాన్లు కొనుగోలు చేసి, బస్సులో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అతనిపై దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక కౌన్సిలర్ మోహినీ సింగ్ ( Mohini Singh) మాట్లాడుతూ.. దాడి జరిగిన విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయినట్లు తెలిపారు. గగన్‌దీప్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లగా.. ఆ పరిస్ధితుల్లో అతడిని చూసి తనకు భయం వేసిందని ఆయన పేర్కొన్నారు.

గగన్‌దీప్‌ కనీసం నోరు కూడా తెరవలేకపోయాడని మోహినీ సింగ్ అన్నారు. అతడి ముఖంపై తీవ్రంగా కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. యువకుడి కళ్లు వాచిపోయి ఉన్నాయని, తీవ్ర గాయాలతో బాధపడుతున్నాడని ఆమె చెప్పారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కిరాణా సామాగ్రి కొనుగోలు చేసి బస్సులో ఇంటికి వెళ్తుండగా.. 12 నుంచి 15 మంది యువకులు గగన్‌దీప్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడినట్లు తనతో చెప్పాడని మోహినీ తెలిపారు. ఆ మూకల గుంపు తనకు ఇబ్బంది పెట్టడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దాంతో ఆ గుంపు ఇంక రెచ్చిపోయినట్లు గగన్‌దీప్ చెప్పాడట. వారి వేధింపులు ఎక్కువ కావడంతో అతడు మధ్యలోనే బస్సు దిగిపోయాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న అతడిపై దుండగుల గుంపు కూడా బస్సు దిగి చుట్టుముట్టింది. ఆ తర్వాత వారంతా కలిసి మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు. నడిరోడ్డుపై తీవ్రంగా కొట్టారు.