మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బుధవారం వేకువజామున భారత్ చేరుకున్నారు. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పాంపియో పర్యటన కొసాగుతుందని ఆ దేశం స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నత స్థాయికి చేర్చడానికి మోదీ, ట్రంప్ నాయకత్వాలు నిబద్ధతతో ఉన్నాయని పాంపియో భారత్‌కు చేరుకున్న సందర్భంగా అమెరికా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాలు సహజ మిత్రులని అందులో వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో మోదీకి లభించిన స్పష్టమైన మద్దతు ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ, ఇంధన, విమానయాన, అంతరిక్షం లాంటి రంగాల్లో రెండు దేశాల సహకారం వేగవంతమైన పురోగతి దిశగా సాగుతోందని వెల్లడించారు. త్వరలో జరగబోయే జీ-20 సమావేశాల సందర్భంగా మోదీ, ట్రంప్ మధ్య సమావేశం జరగునున్న అంశాన్ని ప్రస్తావించారు. అలాగే జపాన్, ఆస్ట్రేలియాతోనూ చర్చలు జరగనున్నట్లు తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మెరుగైన సహకారం కోసం ఈ నాలుగు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. పర్యటనలో భాగంగా పాంపియో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర విదేశాంగమంత్రి ఎస్.జయశంకర్‌తో కూడా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉగ్రవాద నిర్మూలన, వాణిజ్య సంబంధాలు, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు లాంటి పలు కీలక అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. ఇటీవల భారత్‌కు అమెరికా వాణిజ్య ప్రాధాన్య హోదాను రద్దు చేయడం, దానికి ప్రతీకారంగా అమెరికా ఎగుమతులపై భారత్ సుంకాలు పెంచడం లాంటి పరిణామాల నేపథ్యంలో పాంపియో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన అనంతరం పాంపియో జపాన్‌లో జరగబోయే జీ-20 సమావేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు.
మోడీతో మైక్ పాంపేయో ములాఖాత్
Related tags :