అమెరికాలోని వర్జీనియాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు డా.గోరంట్ల వాసుబాబు కృష్ణాజిల్లా తిరువూరు మండలం రోలుపడి ప్రాధమిక ఉన్నత పాఠశాలకు 25వేల రూపాయల విలువైన ఆధునిక బోధనా ఉపకరణాలను విరాళంగా అందజేశారు. వాసుబాబు ఇప్పటివరకు రాష్ట్రంలోని 120 పాఠశాలలకు తన సొంత ఖర్చులతో భోదనోపకరణాలను విరాళంగా అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హైస్కూళ్ళు, యుపీ స్కూళ్ళకు ఆయన సైన్స్ పరికరాలు, చార్టులు ఆధునిక భోదనలో ఉపయోగపడే పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు. రోలుపడి పాఠశాలలో ఈ పరికరాలను జడ్పీటీసీ సభ్యురాలుకిలారు విజయబిందు పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. అనంతరం ఈ పరికరాలతో ప్రదర్శన నిర్వహించి విద్యార్ధులకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో కిలారు పౌండేషన్ నిర్వాహకులు, సీనియర్ జర్నలిస్ట్ కిలారు ముద్దుకృష్ణ, గ్రామ మాజీ సర్పంచి కిలారు రమేష్, పాఠశాల ప్రధానోపాద్యాయులు షేక్.హుస్సేన్, ఇతర ఉపాద్యాయులు పాల్గొన్నారు.