దిల్లీ: రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు (opposition parties) తాజాగా ఈ విషయంపై మూకుమ్మడిగా సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.
ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల (central probe agencies) వివక్షపూరిత వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం..ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ED) వంటి దర్యాప్తు సంస్థలు.. కేవలం భాజపా (BJP) ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఈ పిటిషన్‌లో విపక్షాలు ఆరోపించాయి. ఒకవేళ సీబీఐ (CBI), ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు భాజపాలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు ముగిసిపోతున్నాయని దుయ్యబట్టాయి. ”95శాతం కేసులు ప్రతిపక్షాలపైనే. అరెస్టుకు ముందు, తర్వాత దర్యాప్తు సంస్థలు (central probe agencies) పాటిస్తున్న మార్గదర్శకాలు ఏమిటీ?” అని విపక్ష పార్టీలు ఈ పిటిషన్‌లో కోరాయి.
కాంగ్రెస్ (Congress) సహా, తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), జనతా దళ్ యునైటెడ్ (JDU), భారత్ రాష్ట్ర సమితి (భారాస BRS), రాష్ట్రీయ జనతా దళ్ (RJD), సమాజ్‌వాదీ పార్టీ (SP), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), వామపక్షాలు, డీఎంకే (DMK) పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్ దాఖలు చేశాయి. మరోవైపు విపక్షాల ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. దర్యాప్తు ఏజెన్సీ (Probe Agencies)లు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టం చేసింది..