Business

కొత్త సంవత్సరం. స్టాక్ మార్కెట్ లలో పెను మార్పులు..

కొత్త సంవత్సరం. స్టాక్ మార్కెట్ లలో పెను మార్పులు..

ఏప్రిల్ 1 నుంచి కొత్త అకౌంటింగ్ ఇయర్ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు వచ్చే వారం చాలా కీలకంగా మారనున్నాయి. గత వారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తాయా..? లేక నష్టాల్లోకి జారుకుంటాయా..? అనే ఉత్కంఠ చాలా మంది ఇన్వెస్టర్లలో ఉంది. అయితే మార్కెట్ల దిశను నిర్ణయించే కొన్ని కీలక అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ డబ్బును కుమ్మరించటంతో గతవారం మార్కెట్లు పదునైన లాభాలను నమోదు చేశాయి. దీంతో ఇండియా విక్స్ సూచీ భారీగానే తగ్గి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో కొనసాగేందుకు సహకరించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో చాలా మార్పులు ఇన్వెస్టర్ల నుంచి టాక్స్ పేయర్ల వరకు అందరిపై ప్రభావాన్ని చూపనున్నాయి.

ఈ క్రమంలో భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే మానిటరీ పాలసీ సమావేశాలు రానున్న వారం జరగనున్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సారి కూడా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని తెలుస్తోంది. అయితే రేటు పెంపు 25 బేసిస్ పాయింట్లకు పరిమితం కావచ్చని వారు చెబుతున్నారు. దీనికి తోడు ఆటో రంగం అమ్మకాల వివరాలు, ప్రపంచ మార్కెట్లలో చోటుచేసుకునే ఇతర పరిణామాలు ఇన్వెస్టర్లకు చాలా కీలకంగా మారనున్నాయి. ఒక వేళ FIIల అమ్మకాల ఒత్తిడి తక్కువగా ఉన్నట్లయితే భారత మార్కెట్లలో భారీ ర్యాలీ కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు డేటాపై ఎక్కువగా ఆధారపడుతూ ముందుకు సాగుతారని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ జోసెఫ్ థామస్ వెల్లడించారు. నిరుద్యోగిత రేటు పెరుగుదల నుంచి బ్యాంకింగ్ సంక్షోభం వరకు అమెరికా మార్కెట్లకు సంబంధించిన అనేక అంశాల ప్రభావం నేరుగా భారత మార్కెట్లపై పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లు పతనమైతే ఆ అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇదే స్ట్రాటజీని అమలు చేస్తున్నాయి. పతనం సమయంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి.