NRI-NRT

హాం కాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..

హాం కాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..

తెలుగువారి పండుగ ఉగాది, శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందడి దేశ విదేశాల్లో ఎంతో ఉత్సాహంగా మొదలయినాయి …

మూడు సంవత్సరాలుగా పీడిస్తున్న కోవిడ మహమ్మారి కారణంగా ఎన్నో బాధలను ఎదురుకొంటున్న ప్రజలకు ఈ యుగాది ఎన్నో ఆశాలని ఆశయాలని శోభాయమానంగా ఆనందాలని ఆరోగ్యాన్నిస్తుందని ఆశిస్తున్నారు.

చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగ గా తెలుగువారే కాకుండా కన్నడ వారు ‘యుగాది‘ గా మరాఠీలు ‘గుడిపడ్వా’ గా, సింధీ వారు ‘చెట్టి చాంద్ ‘ గా జరుపుకుంటారు. ఈ పండుగ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది షడ్రుచుల ఉగాది పచ్చడి. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే షడ్రుచుల ఉగాది పచ్చడి. యుగాది లేదా ఉగాది అనే పేరు సంస్కృత పదాల యుగ (యుగం) మరియు ఆది (ప్రారంభం) నుండి ఉద్భవించింది: “కొత్త యుగం ప్రారంభం”. యుగాది లేదా ఉగాది “చైత్ర శుద్ధ పాడ్యమి” లేదా చైత్ర మాసంలో ప్రకాశవంతమైన సగం మొదటి రోజున వస్తుంది. ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వస్తుంది. ఈ సంవత్సరం మనం శుభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము.

ఆయుర్వేద ప్రపంచంలో, వేప అనేది ఒక ప్రసిద్ధ మూలిక, ఇది వివిధ సాంప్రదాయ నివారణలలో కీలక పాత్ర పోషిస్తుంది (సుమారు 5000 సంవత్సరాల నాటిది). అయినా అలాంటి వేప చెట్టు హాంగ్ కాంగ్ లో ఎక్కడ దొరకదు, మరి ఉగాదికి వేప పువ్వు ఎలా దొరుకుతుంది ? అందుకే మన తెలుగు వారంతా భారత దేశం ఎప్పుడు వెళ్ళినా గుర్తు పెట్టుకొని వేప పువ్వు తెచ్చుకుంటారు.. కొన్ని సార్లు ఇక్కడ ఇండియన్ షాప్స్ లో తెప్పిస్తారు .. అదృష్టం బాగుంటే దొరికినట్టు లేదా కాకరకాయతో ఉగాది పచ్చడి రెడీ!!

ఈ శోభకృత నామ సంవత్సర ఉగాది, హాంగ్ కాంగ్ వారికి ప్రత్యేకంగా ఒక కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఎందుకంటే కోవిడ మొదలైనప్పటి నుంచి జనవరి 2023 వరకు మాస్క వేసుకోవడం, మరియు పరిమిత సంఖ్య లో సామాజిక సమావేశల ప్రభుత్వ నిబంధనల తొలగింపు అనేది దానికికదే ఒక గొప్ప వేడుక. అందుకని మూడు సంవత్సరాల తరువాత ఇండియా క్లబ్ లో జరిగిన ఉగాది వేడుకలలో తెలుగు వారందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారి ఉగాది వేడుకలని హాంగ్ కాంగ్ లో భారత ప్రభుత్వ దౌత్యాధికారి యాక్టింగ్ కాన్సుల్ జనరల్ శ్రీమతి రెంజిన వర్గీస్ గారు దీప ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు
సాంస్కృతిక కార్యక్రమాలను మహిళా విభాగమ్ “సఖియా “ వారు మా తెలుగు తల్లి “ పాటతో ప్రారంభించగా, ఆంధ్రనాట్యంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన శ్రీ సంజయ్ వాడపల్లి గారి నాట్యప్రదర్శన, అనంతరం శ్రీమతి శాంకరి బెల్లంకొండ గారి కూచిపూడి నాట్య ప్రదర్శనలతో కొనసాగాయి . శ్రీమతి రెంజని మాట్లాడుతూ ఒక భాష – ఒక సంస్కృతి కి గుర్తింపునిచ్చే ఒక పండుగ ని ఒక వేడుక గా అందరూ ఇంత ఉత్సాహంగా పాల్గొనడం తనకి ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇలాంటివి, మన భాష సంస్కృతి సంప్రదాయాలకు ప్రాముఖ్యతనిచ్చే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం భావితారానికి ఇవ్వాలని పేర్కొన్నారు ..
ఉగాది వేడుకలలో విశేష అతిధులుగా చిన్మయా మిషన్ హాంగ్ కాంగ్ – స్వామిని సుప్రియానందా గారు విచ్చేసి తమ ఆనందాన్ని తెలుపుతూ ఆశీర్వదించారు ; మిస్ మిటజీ లీయోంగ్ – యునెస్కో

హాంగ్ కాంగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు; పోలీస్ కమ్యూనిటీ రిలేషన్స్ ఆఫీస్, యౌ సిమ్ డిస్ట్రిక్ట్, హాంగ్ కాంగ్ పోలీస్ ఫోర్స్ నుంచి మిస్ ఏవా చొయ్ మరియు మిస్టర్ హుంగ్ కా వాయి. స్థానిక ఇండియా క్లబ్ అధ్యక్షులు శ్రీ నాను లచమన గారు పాల్గొన్నారు..
ఉత్సాహభరితమైన ఈ వేడుకలలో హాస్యరసాన్ని పండించిన రెండు చిట్టి నాటికలు “యమగోల” మరియు “డోంట్ స్టాప్ లాఫింగ్, ఫ్రెండ్స్ లొల్లి లోడింగ్” ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. పాటలు, నృత్యాలతో సమాఖ్య సభ్యులందరు కలిసి ఒక తెలుగు కుటుంబంవలే పండుగ వేడుకలు జరుపుకున్నారు. సాంస్కృతిక వేదిక రధ సారధులుగా కుమారి వినూత్న, ధర్మపురి దంపతులు శ్రీమతి నీలిమ, శ్రీ గోపి గార్లు అద్భుతంగా నిర్వహించారు.

ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇండియా, శుభోదయం గ్రూప్, ఇండియా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వార సంయుక్తంగా 4 డిసెంబర్ 2021 నుండి 4 డిసెంబర్ 2022 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడిన ఘంటసాల స్వరరాగ మహాయాగం లో పాల్గొన్న ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య గాయని గాయకులు – శ్రీమతి హర్షిణి పచ్చంటి, కుమారి గాయత్రి ఇయుణ్ణీ, శ్రీ ఈరంకి శ్రీహరి బాలాదిత్య, శ్రీ కోట్ల సత్యనారాయణ; శ్రీ ఫణికుమార్ కొత్తూరు మరియు శ్రీ
జైరాం పరమేశ్వరన్ ను ఈ వేడుకలో ప్రత్యేకంగా సత్కరించడం జరిగింది. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి చేస్తున్న తెలుగు భాష – సాంస్కృతిక – సామాజిక సేవలను కొనియాడుతూ, మూడు దశాబ్దాలుగా హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న శ్రీమతి సుజాత గోవాడ గారు మరియు శ్రీమతి అరుణ పాముల గారు, యాక్టింగ్ కాన్సుల్ జనరల్ శ్రీమతి రెంజిన వర్గీస్ గారి చేతుల మీదుగా సత్కరించారు.

సమాఖ్య ఆటల పోటీలలో విజేతలను, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న వారిని కూడా సత్కరించారు. ప్రధాన కార్యవర్గ సభ్యులైన శ్రీ రాజశేఖర్ మన్నే, శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి మాధురి కొండ మరియు శ్రీ హరీన్ తుమ్మాలా లను అభినందించి సత్కరించారు. సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి సారంగా రమాదేవి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.