Business

వాహనదారులకు బాదుడే బాదుడు.. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరాలంటే ఇంత సమర్పించుకోవాల్సిందే

వాహనదారులకు బాదుడే బాదుడు.. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరాలంటే ఇంత సమర్పించుకోవాల్సిందే

టోల్ వసూళ్లు అంటేనే అదేదో రౌడీ మామూళ్లన్నట్టే ఉంటాయ్. కట్టాకే కదలరా భయ్ అంటూ గేట్లు మూసి దందా చేసుడే ఎటు చూసినా. ఐనా… రోడ్లను వాడుతున్నాం కనుక టోల్‌ ఫీజు కట్టడం మన విధి… మన కర్తవ్యం. కానీ… కడుతున్నాం కదా అని మన జేబులకు అదేపనిగా కత్తెర్లేస్తే? అదే జరుగుతోందక్కడ.

ఏప్రిల్ 1న విడుదల అంటూ దేశంలోని ప్రయాణీకులందరికీ షాకిస్తూ టోల్‌టాక్స్ భారీగా పెరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI నిబంధన ప్రకారం ఏటా ఏప్రిల్‌లో టోల్ చార్జీల పెంచుకునే వెసులుబాటుంది. కానీ.. మరీ ఇంత భారీగా పెంచుడేంది అని గగ్గోలు పెడుతున్నారు ప్రయాణీకులు. వాహనం స్థాయిని బట్టి 5 నుంచి 49 రూపాయల వరకు పెరిగింది టోల్ ఛార్జ్‌. నెలవారీ పాస్‌లపై 275 నుంచి 330 రూపాయల వరకు పెరిగాయి. జిల్లాల మీదుగా రాకపోకలు సాగించే వారికి సైతం టోల్ బాదుడు తప్పడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్ని కలిపే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి, హైదరాబాద్‌-వరంగల్‌ 163వ నంబర్ జాతీయ రహదారి చాలా కీలకం. ఈ రెండు హైవేల మీద వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువ. ఒక్క పంతంగి టోల్‌ప్లాజా మీదుగానే ప్రతిరోజూ 30 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సెలవు దినాల్లో ఐతే ఈ సంఖ్య 45 వేలకు పైనే.

వరంగల్ హైవేపై బీబీనగర్ మండలం గూడురు టోల్‌ప్లాజా, విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్ల పహాడ్, ఏపీలోని చిల్లకల్లు టోల్‌ప్లాజాను దాటుకుని వెళ్లాలి. ప్రస్తుతం కంటే సగటున 4 నుంచి 4.5 శాతం టోల్ పెరిగింది. విశాఖ జిల్లా అంగనంపూడి టోల్ వద్ద వాహనాలను బట్టి 410 రూపాయల వరకు కనీస టోల్ ఛార్జ్ పెరిగింది. మౌలిక వసతులు కల్పించకుండా… రోడ్ల నిర్వహణ సరిగా చేయకుండా టోల్‌ చార్జీలు మాత్రం క్రమం తప్పకుండా పెంచడం విమర్శలకు తావిస్తోంది. గడ్కరీ చెప్పిన లెక్కలకు పెరిగిన టోల్‌ చార్జీలకీ సంబంధమే లేదని, ఈ భారం మోయలేనిదని గొల్లుమంటున్నాడు సామాన్యుడు.

గూడ్స్ వాహనాలపై కూడా బాదుడు షురూ కావడంతో లారీలు నడపలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ఓనర్లు. పెరిగిన టోల్ చార్జీలు 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. మళ్లీ పెరగవన్న గ్యారంటీ కూడా లేదు. అటు… పెరిగిన టోల్ భారాన్ని సీరియస్‌గా తీసుకుని ఆర్టీసీ ప్రయాణీకుడ్ని కూడా టార్గెట్ చేశాయి ప్రభుత్వాలు. టోల్ సేస్ పేరుతో భారీగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది టీఎస్ ఆర్టీసి. ఆంధ్రప్రదేశ్‌ కూడా తెలంగాణా రూట్లోనే వెళుతోంది. మొత్తానికి ఎర్ర బస్సు చార్జీల మోత పెరిగిందన్నమాట. ఎక్స్ ప్రెస్ బస్సుకి 6 నుంచి 10 రూపాయలు, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుకి 9 నుంచి 13 రూపాయల వరకు చార్జ్ పెరగనుంది. ఏసీ బస్సుకైతే గరిష్టంగా 20 రూపాయలు పెరిగింది.

కేస్ స్టడీ కోసం హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే ఫోర్ వీలర్‌నే తీసుకుందాం. ఈ మార్గంలో 4 టోల్‌గేట్లను దాటితేనే… బెజవాడలో అడుగు పెట్టగలం. నల్గొండ జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా దగ్గర 95 రూపాయలు చెల్లిస్తేనే ఫోర్‌వీలర్‌కి ఎంట్రీ. కీసర టోల్‌ప్లాజా దగ్గర ఫోర్‌వీలర్‌ చెల్లింపు ? కొర్ల పహాడ్‌లో 125 రూపాయలు. చిల్లకల్లు టోల్‌ ప్లాజా దగ్గరైతే సింగిల్ జర్నీకి 105 రూపాయలు. ఈ లెక్కన దాదాపు 400 రూపాయలకు పైగా టోల్‌గేట్ల దగ్గర సమర్పించుకోవాల్సిందే. నిన్నటి కంటే ఇది దాదాపు 50 రూపాయలు పెరిగినట్టు లెక్క. ఆర్టీసీ ప్రయాణీకులకైతే పెరిగిన టోల్ కారణంగా పరోక్ష వడ్డన గరిష్టంగా 20 రూపాయలు. ఇదీ… ప్రయాణికులకు టోల్‌ రూపంలో కేంద్రం ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్.