న్యూయార్క్: అమెరికా (USA) లోని బోస్టన్ (Boston)లో దారుణం చోటు చేసుకుంది. భారత్ నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లిన ప్రవాసాంధ్రుడుప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోస్టన్లోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వచంద్ కోళ్ల (47)గా గుర్తించారు. ఆయన అమెరికాలోని టకెడ ఫార్మాస్యూటికల్ సంస్థలో డేటా అనలిస్ట్‌గా పని చేస్తున్నారు.
భారత్ నుంచి ఓ సంగీత వాయిద్య కళాకారుడైన తన స్నేహితుడు వస్తున్నాడని తెలుసుకొని.. ఆయన్ని పికప్ చేసుకునేందుకు విశ్వచంద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. తన ఎస్ యూవీ వాహనంలో విమానాశ్రయం బయట టెర్మినల్-బి వద్ద వేచి చూస్తుండగా.. అటువైపుగా వస్తున్న డార్ట్ మౌత్ ట్రాన్స్పోర్ట్కు చెందిన వాహనం.. ఎస్యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. సమీపంలో ఉన్న నర్సు వెంటనే స్పందించి విశ్వచందు కారునుంచి బయటకి తీసి పరీక్షించింది. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు డార్ట్ మౌత్ వాహనం నడిపిన మహిళా డ్రైవర్‌ను ప్రశ్నించి.. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న మస్సాచుసెట్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
మరోవైపు డార్ట్ మౌత్ వాహనంలోని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు మరో వాహనంలోకి మార్చారు. ఈ ఘటనపై డ్రాట్ మౌత్ ట్రాన్స్‌పోర్టు విచారం వ్యక్తం చేసింది. కేసు విషయంలో మస్సాచుసెట్స్ పోలీసులకు సహకరిస్తామని తెలిపింది. మరోవైపు విశ్వచంద్ పని చేస్తున్న ఫార్మా సంస్థ ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. నిబద్ధత కలిగిన ఉద్యోగిని కోల్పోవడం బాధాకరంగా ఉందంటూ మెయిల్ చేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. మరోవైపు విశ్వచంద్ స్నేహితులు, బంధువులు ‘గో ఫండ్ మి’ పేరిట వ క్రియేట్ చేశారు. దీని ద్వారా ఇప్పటి వరకు 4,06,151 అమెరికన్ డాలర్లు పోగు చేశారు. దీనిని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.