Kids

అతి గారాబం సమాజ నాశనం

Pampering Your Kids Not Only Spoils Them But Damages Society Too

పిల్లలు కోరిందల్లా కొనిస్తాం… ఎంత అల్లరి చేస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తాం… వాళ్ల మాటలకు, చేతలకు మురిసిపోతాం. ఆ అతి గారాబమే సమస్యలు తెచ్చిపెడుతుంది. పెరిగి, పెద్దయ్యాక వాళ్లను ఎలా మార్చాలా అని ఆలోచించే బదులు… చిన్నప్పుడే ఆ గారాబాన్ని అదుపులో ఉంచడం మంచిదంటారు నిపుణులు. ప్రతి తల్లిదండ్రికీ తమ బిడ్డ ప్రత్యేకమే. తమలా పిల్లలు కష్టపడకూడదని, తమకు లభ్యం కానివి వాళ్లకు దక్కాలని ఆరాటపడుతుంటారు. ఎందులోనూ లోటు రాకూడదనుకుంటారు. ఇదేమీ తప్పు కాదు కానీ ఈ ప్రత్యేక శ్రద్ధ, వాళ్లకు ఇచ్చే స్వేచ్ఛ, నిర్ణయాధికారం పిల్లలకే వదిలేయడం, అవసరానికి మించి అడిగింది ఇవ్వడం… వంటివన్నీ మితిమీరితేనే సమస్య. పిల్లలు ఇతరుల దగ్గరా అలాగే ప్రవర్తిస్తారు. అందరిలో తాము ప్రత్యేకమని అనుకుంటారు. ఎదిగేకొద్దీ సమస్యలు కొని తెచ్చుకోవడమే కాదు, మరికొన్ని ఇబ్బందుల బారినా పడతారు. చిన్నారులకు నచ్చిన వస్తువులతో మొదలుపెడదాం. వాళ్లు ఏదయినా కావాలనుకుంటే మొదట అభ్యర్థిస్తారు. వెంటనే ఇస్తే ఆ తరువాత అడగడం నేర్చుకుంటారు. అప్పుడూ ఇచ్చారనుకోండి… అడిగిందల్లా ఇస్తున్నారు కదాని ఇంకా కావాలంటూ మంకుపట్టు పట్టడం మొదలుపెడతారు. ఒకవేళ అది ఇచ్చే స్థోమత లేదనే ఉద్దేశంతో నిరాకరిస్తే గోల చేస్తారు. ఇలా దశల వారీగా సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు ఏదయినా పెద్ద మాటలు మాట్లాడినప్పుడు మురిసిపోయామా… పదేపదే అదే కొనసాగిస్తారు. క్రమంగా వద్దని వారిస్తున్నా వినిపించుకోని స్థితికి చేరుకుంటారు. ఈ రెండూ మాత్రమే కాదు… అమ్మానాన్న ఏమనరనే ఉద్దేశంతో చేసే విపరీతమైన అల్లరి, పెద్దవాళ్లను ఎదిరించడం, మంకుపట్టు పట్టడం, సరిగ్గా చదవకపోవడం… ఇవన్నీ గారాబంతోనే మొదలవుతాయి. అతిగా గారాబం చేసిన పిల్లల్లో మార్పు తేవడం ఒక్కరోజులో సాధ్యం కాదు. ముందు కారణాలు తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. మీ బాల్యం గుర్తు చేసుకోండి. మీ తల్లిదండ్రులు మీకేం చేయలేదు కాబట్టి మీరు మీ పిల్లలకు చేయాలనుకుంటున్నారా… పిల్లలు అడిగిందల్లా ఇవ్వడం వల్ల మీకు ఆనందం కలుగుతుందా… అంచనా వేసుకోండి. ఇకపై అలా వద్దు. ప్రతిదానికి తొందరపడి కొనేయకుండా… పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచేలా చూడండి. చేతినిండా డబ్బు ఉన్నా లేకపోయినా, అడిగిన ప్రతిదీ దక్కదని వాళ్లకు స్పష్టం చేయండి. ఇన్నాళ్లూ అలవాటు చేసి ఇప్పుడు కాదంటే వాళ్లు వినిపించుకోరు కానీ..ఓపికపడితే అది సాధ్యమే. పిల్లల్ని గారాబం చేయాలి కానీ… వాళ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, అకారణంగా అడిగిందల్లా కొనిచ్చేయడం వల్ల ఉపయోగం ఉండదు. వాళ్లకు హాని చేసినవాళ్లమవుతాం. బదులుగా వాళ్లతో నాణ్యమైన సమయం గడిపేలా చూడండి. వాళ్లు ఏవయినా అడిగినా… రాబోయే సందర్భమో, పరీక్షకో ముడిపెట్టి.. ‘అప్పుడు కొనివ్వడానికి ప్రయత్నిస్తా…’ అని చెప్పండి. బాల్యంలో వాళ్లకు మీరెంత అండగా ఉన్నా సరే… ఎదిగేకొద్దీ వాళ్లే స్వతంత్రంగా పనులన్నీ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకుని… చిన్నతనం నుంచీ వాళ్ల పనులు వాళ్లే చేసుకునేలా ప్రోత్సహించాలి. చదువు అయినా, వ్యక్తిగత అవసరాలు అయినా…వాళ్లంతట వాళ్లే చేసుకునేలా ప్రోత్సహించాలి. అవసరాన్ని బట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా చూడాలి. పిల్లల్ని పెంచేటప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి వాళ్లు ఏదయినా పని చేయగలరని తెలిసినప్పుడు మనం కల్పించుకోకూడదు. రెండోది వాళ్లు పిల్లలు, మనం తల్లిదండ్రులమని గుర్తుపెట్టుకోవాలి. కోరింది ఇస్తూనే బాధ్యతను అలవాటు చేయాలి. కష్టం, సుఖానికి మధ్య తేడా వాళ్లకు అర్థం కావాలి. అవసరం అయితే… కష్టపడేందుకు వాళ్లను సిద్ధం చేయాలి .ఒక గ్యాడ్జెట్‌ ఇచ్చినా పరిమితి పెట్టాలి. డబ్బు ఇచ్చినా… వివరాలు తెలుసుకోవాలి. స్నేహితులతో వెళ్తున్నా… ఎంత సేపట్లో రావాలో చెప్పాలి. మీరు అన్నీ గమనిస్తున్నారని పిల్లలు అర్థంచేసుకుంటారు. జాగ్రత్తగా ఉంటారు.

పిల్లలు ఏదయినా సాధించగానే ఓ బహుమతి కొనిచ్చి అభినందిస్తాం. అలా ప్రతిసారి అవసరంలేదు. అదే జరిగితే… బహుమతి వస్తుందని సాధించేందుకు ప్రయత్నిస్తారు. వాళ్లకు కష్టం విలువ తెలియజేయండి. బహుమతి అయినా సరే… అవసరానికి, విలాసానికి మధ్య తేడా వివరించండి. ఏదీ అంత సులువుగా రాదనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. మీరు పిల్లల్ని ప్రేమిస్తారనే విషయాన్ని వాళ్లకు తెలియజేయాలి కానీ అక్కడితోనే ఆగిపోకూడదు. తప్పు చేస్తే తిడతారని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రేమను మాటలతో చెప్పాలి. మంచి పని చేస్తే అభినందించాలి. తప్పుచేస్తే వెంటనే ఖండించాలి. అవసరం అనుకుంటే శిక్షించాలి. ఈ తేడాను వివరించగలిగితే గారాబం సమస్యగా మారదు. పిల్లలు పెద్దయ్యేకొద్దీ దురలవాట్ల బారినపడటం చూస్తూనే ఉంటాం. ఈ సమస్య ఎదురుకాకూడదంటే… మొదటినుంచీ వాళ్ల జీవితం పక్కాగా ఉండేలా చూడాలి. వేళకు నిద్రపోవడం, ఓ సమయానికి చదవడం, పోషకాహారం తీసుకోవడం, ప్రత్యేకమైన అభిరుచులు… తప్పనిసరి. సాంకేతికతకు వీలైనంతవరకూ దూరంగా ఉంచడం మంచిది. ఇవన్నీ చిన్నారులకు భవిష్యత్తులో మేలుచేస్తాయి. ఇవన్నీ వారిని క్రమశిక్షణలో పెడతాయి. చిన్నప్పుడు గారాబం చేసినా పెద్దయ్యాక మారతారనుకుంటాం కానీ… కొందరి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు. ఆ గారాబం ప్రభావం వాళ్ల జీవితంపైనా పడుతుంది.

* నేను చెప్పిందే జరగాలనే ధోరణి వారిలో మొదలవుతుంది. పెద్దవాళ్ల మాటలు వినరు. ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఆసక్తి చూపించరు. ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఇతరులతో సర్దుకుపోలేరు.
* ఇటువంటి పిల్లలు ఏ విషయాన్ని, పనిని నేర్చుకోవడానికి ఇష్టపడరు. అన్నింటికీ ఇతరులపై ఆధారపడతారు.
* అబద్ధాలు చెప్పే అవకాశాలూ ఎక్కువే. బద్ధకం, మాట వినకపోవడం, మొండిపట్టుదల వంటి సమస్యలూ కనిపిస్తాయి.
* పెద్దలను, ఇతరులను గౌరవించరు. డబ్బు విలువా తెలియదు. అహంకార భావం పెరుగుతుంది.

గారాబం చేయడం వల్ల కొందరు చిన్నారులు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు దాన్ని నాయకత్వ లక్షణాలని అనుకుంటారు కానీ కాదు. అదే కొనసాగితే పెద్దయ్యేకొద్దీ ఎదిరించడం మొదలుపెడతారు. చిన్నప్పటినుంచీ వాళ్లకంటూ పరిధి పెట్టాలి. ఏది అవసరమో, ఏది అనవసరమో విచక్షణతో ఆలోచించాకే వారికి సమకూర్చాలి. అప్పటివరకూ గారాబం చేసిన పిల్లల్ని మార్చాలనే ఉద్దేశంతో వాళ్లతో కఠినంగా ఉంటే వారిలో అభద్రతాభావం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. నిదానంగా వారిని మార్చాలి. పిల్లల పెంపకం విషయంలో పెద్దవాళ్లు ఒకేమాటమీద ఉండాలి. లేదంటే చిన్నారులు దాన్ని అవకాశంగా తీసుకుని… ఇద్దరినుంచీ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తారు. గారాబానికి విపరీతంగా అలవాటైతే మానసిక నిపుణులను సంప్రదిస్తే… కౌన్సెలింగ్‌ చేస్తారు.