మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. జంక్ ఫుడ్ ను, మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, అలాగే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, మలబద్దకం, అజీర్తి, ఒత్తిడి, ఆందోళన, టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ రకాల కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. చాలా మంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే మందులను, సిరప్ లను, పొడులను తాగుతూ ఉంటారు.
వీటిని వాడడం వల్ల ప్రేగులకు సంబంధించిన సమస్యలు రావడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మందులను వాడే అవసరం లేకుండా కొన్ని ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఉదయం పూట పరగడుపున అర లీటర్ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అదే విధంగా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలి లేకపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వక గ్యాస్, పుల్లటి త్రేన్పులు వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి.
ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. జంక్ ఫుడ్ కు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటితో పాటు ఒక చక్కటి ఇంటి చిట్కాను వాడడం వల్ల మనం గ్యాస్ సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చు. గ్యాస్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక గ్లాస్ వేడి నీటిని తాగాలి. వేడి నీటిని తాగడం వల్ల గ్యాస్ సమస్య నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. అలాగే నీటిలో యాలకులు, లవంగాలు వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. నీటిని తాగడం ఇష్టంలేని వారు రెండు యాలకులను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి.
ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు. అదే విధంగా వాము నీటి కషాయాన్ని తాగడం వల్ల కూడా మనం గ్యాస్ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు పొట్టను బెల్ట్ తో, బొందులతో బిరుగ్గా కట్టకూడదు. అలాగే గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. ఆకలి వేసినప్పుడే మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తినేటప్పుడు నీటిని తాగకూడదు. గ్యాస్ సమస్య ఉన్న వారు రాత్రి పూట పండ్లనుమాత్రమే ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తీసుకోవాలి. ఈ విధంగా చిట్కాలను పాటిస్తూ తగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.