Devotional

16నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు

16నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు

భద్రాచలం, ఏప్రిల్‌ 9: భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 16వ తేదీ నుంచి ఆరు నూతన ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అధికారిక ఆమోదం తెలిపారు.

వేద ఆశీర్వచనం

స్వామివారి దర్శనం అనంతరం బేడా మండపంలో దంపతులు లేదా ఒకరికి నిర్వహిస్తారు. ఉదయం 9.30నుంచి 11గంటల వరకు అవకాశం ఉంటుంది. రూ.500చెల్లించి ఈ సేవలో పాల్గొన్న భక్తులకు కండువా, జాకెట్‌ పీస్‌, 100గ్రాముల చిన్న లడ్డూలు రెండు అందజేస్తారు.

స్వామివారికి తులసిమాల అలంకరణ

ఈ సేవ ప్రతి శనివారం ఉదయం 7గంటలకు మాత్రమే ఉంటుంది. దంపతులు లేదా ఒకరు పాల్గొనవచ్చు. రూ.1,000 చెల్లించి ఈ సేవలో పాల్గొన్న భక్తుల శిరస్సుపై తులసిమాలలు ఉంచి ఆలయ ప్రదక్షిణ గావించి అంతరాలయంలో వారి సమక్షంలో దృవమూర్తులకు అలంకరణ చేస్తారు. ఈ సేవలో పాల్గొన్న వారికి కండువా, జాకెట్‌ పీస్‌, 100గ్రాముల లడ్డూలు రెండు, రామకోటి పుస్తకం (అంతరాలయ అర్చనతో) అందజేస్తారు.

ఉదయాస్తమాన సేవ

ఆ రోజు ఆలయంలో స్వామివారికి నిర్వహించే సుప్రభాతసేవ నుంచి పవళింపు సేవ వరకు అన్ని రకాల సేవల్లో దంపతులను అనుమతిస్తారు. ఆ సేవలకు వచ్చే సదుపాయాలన్నీ వీరికి వర్తిస్తాయి. ఈ సేవలో పాల్గొనే వారు రూ.5వేలు టికెట్‌ ధర చెల్లించాలి.

శ్రీరామనవమి ముత్యాల సమర్పణ

ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.10వేలు టికెట్‌ ధర చెల్లించాలి. శ్రీరామనవమి కల్యాణం సెక్టార్‌-2లో వీరిని అనుమతిస్తారు. ఈ సేవలో పాల్గొనే వారికి కల్యాణ వసా్త్రలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు అందజేస్తారు.

నిత్యపూల అలంకరణ సేవ

ఈ సేవ సోమవారం నుంచి శనివారం వరకు ఆ రోజున స్వామి వారికి, ఉప ఆలయాలకు అవసరమైన పూల దండలు సమర్పణకు అవకాశం ఇస్తారు. రూ.5వేలు టికెట్‌ ధరపై భక్తులను అనుమతిస్తారు. ఈ సేవలో పాల్గొన్న వారికి కండువా, జాకెట్‌ పీస్‌, 100గ్రాముల లడ్డూలు రెండు, నలుగురికి అన్న ప్రసాదం అందిస్తారు.

తులాభారం (ప్రతిరోజు)

ఈ సేవ ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3నుంచి రాత్రి 8గంటల వరకు ఉంటుంది. రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. తులాభారం కింద స్వామివారి సేవకు సంబంధించి ఎలాంటి వస్తువునైనా, అన్నదానంకు సంబంధించిన సామగ్రిని కూడా సమర్పించవచ్చు.