ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) గురువారం ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి అమెరికా తెలుగు సంఘం తరపున అద్యక్షులు పరమేశ్ భీంరెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుతో పాటు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారని అన్నారు. అంతేకాదు నటిగా, దర్శకురాలిగా తెలుగు సినీ కళామతల్లికి విశిష్ట సేవలందించారని ఈ సందర్భంగా కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, అద్భుతమైన ప్రతిభ చూపగలరని ఆరోజుల్లోనే నిరూపించారని అన్నారు. గత సంవత్సరం అమెరికా తెలుగు సంఘం తరఫున హైదరాబాద్ లో నిర్వహించిన ఆటా వేడుకల్లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును బహుకరించామని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విజయనిర్మల మృతికి “ఆటా” సంతాపం
Related tags :