టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ధన దోపిడీని సీఎం కేసీఆర్ ఎందుకు నిలువరించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ధన దాహంతో విశ్వ నగరాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి కకేటీఆర్ రూ.వేల కోట్ల ధనదాహంతో హైదరాబాద్ విశ్వ నగరాన్ని ధ్వంసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వాణిజ్య భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం మంత్రి డెవలపర్స్ సంస్థకు 15 అంతస్తుల భవనానికి ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేబీఆర్ పార్క్‌ను ఎందరో ముఖ్యమంత్రులు కాపాడారని, సినీ తారల నుంచి సామాన్యుల వరకు ఎందరో కేబీఆర్ పార్క్‌కు వెళుతూ ఉంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ కోసం గతంలో టెండర్లను పిలిచారని, 2006లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని నిబంధనలు పాటించాలన్న షరతులతో అనుమతులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. ఈ టెండర్‌ను మూడు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి దక్కించుకుని.. ఆ తర్వాత కాలంలో మంత్రి డెవలపర్స్ సంస్థ దీనిలో చేరిందని తెలిపారు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో మంత్రి డెవలపర్స్ సంస్థకు ఏడు అంతస్తులు కట్టుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చిందని మండిపడ్డారు. మళ్లీ ఆ తర్వాత అదే సంస్థ.. 12 అంతస్తుల కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేసుకుందన్నారు. 2022లో మరోసారి భూమి లోపల మూడు అంతస్తులు, భూమిపైన 12 అంతస్తులకు అనుమతులు కోరిందన్నారు. అప్పుడే ఆ సంస్థ జుట్టు మంత్రి కేటీఆర్ చేతికి చిక్కిందని అభిప్రాయపడ్డారు.
ఆర్ఎన్ఆర్ డెవలపర్స్ రాకతో మరిన్ని అంతస్తులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఒక్కో ఫ్లాటు.. 8 వేల ఎస్ఎఫ్టీల వైశాల్యంలో నిర్మిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ ఒక్కో ఫ్లాటు విలువ సుమారు రూ.21 కోట్లు పలుకుతుందని తెలిపారు. కేబీఆర్ పార్కులో పువ్వును కోసినా శిక్షించేలా నిబంధనలు ఉన్నాయని.. మరి ఇలా అక్రమాలు చేస్తుంటే అలాంటి వారికి ఏ శిక్షలు వేయాలని మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు.కేబీఆర్ పార్కును ఆనుకొని 15 అంతస్తుల్లో ఫ్లాట్లు నిర్మిస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. అక్కడ ఆగర్భ శ్రీమంతులు మాత్రమే రూ.21 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటారని వెల్లడించారు. ఒక్కో ఫ్లాట్‌లో కనీసం ఐదు, ఆరు కార్ల వరకు ఉంటాయని.. అవి అన్నీ కలిపి వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉందన్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉందని తెలిపారు. జూబ్లీహిల్స్ చౌరస్తాలో పట్టపగలే దోపిడీ జరుగుతోందని, భవిష్యత్‌లో హైదరాబాద్ నివాసానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ దోపిడీని.. సీఎం కేసీఆర్ ఎందుకు నిలువరించట్లేదని ప్రశ్నించారు.