నేటి నుంచి సిపిఎం-సిపిఐ ప్రచార భేరి
పాల్గొనున్న ప్రకాశ్ కరత్, బినరు విశ్వం
సీ పీ ఎం, సీ పీ ఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ
విజయవాడ : బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వ విద్రోహ పూరిత విధానాలపై సిపిఎం, సిపిఐ ఉమ్మడి ప్రచార భేరి శుక్రవారం నుంచి ప్రారంభం కానుందన్నారు. ఈ ప్రచార భేరికి సంబంధించిన పోస్టర్‌ను విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రచార భేరి విజయవాడలో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో మే 1వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఈ ప్రచారభేరిలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, సిపిఐ జాతీయ జాతీయ కార్యదర్శి బినరు విశ్వం పాల్గొంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బిజెపి అరాచక పాలన ఎప్పుడు పోతుందా అనే భావన ప్రజల్లో ఉందన్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, భావోద్వేగాల ద్వారా మరలా అధికారంలోకి రావాలనే దుష్టప్రయత్నం మోడీ, అమిత్‌షా బృందం చేస్తోందని విమర్శించారు. శాంతియుతంగా, సామరస్యంగా సంతోషంగా ప్రజలు పండుగలు, పబ్బలు జరుపుకునే పరిస్థితి లేకుండా బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణను సృష్టించి దేశాన్ని బలహీన పరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణాన్ని, నరేంద్రమోడీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా బిజెపి దుర్మార్గాన్ని సిఎం వైఎస్ జగన్, వైసిపి కనీసం ఖండిరచడం లేదన్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు పాఠశాలల్లో స్వేచ్ఛగా విస్తృతంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల మెదళ్లను మతం పేరుతో నింపుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి బిజెపి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టి, మతసామరస్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడే ఉద్దేశం రాష్ట్రప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేంద్రం ముందు నుంచి పొడిస్తే రాష్ట్రప్రభుత్వం వెనక నుంచి పొడుస్తోందన్నారు. ఇది దుర్మార్గమని, దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రైవేటీకరణపై సిఎం మౌనంగా ఉంటే మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో కుమ్మకై రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని అంగీకరించబోమన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం ట్రేడ్ యూనియన్లు, వామపక్షాలు గట్టిగా నిలబడుతున్నాయని, చేతన్కెతే రాష్ట్రప్రభుత్వం కూడా అండగా నిలవాలని కోరారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముడిసరుకు, పెట్టుబడి కోసం ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్ పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా వేసిందన్నారు. బిడ్డింగ్ వేయడం రాష్ట్రప్రభుత్వానికి చేతగావడం లేదా అని ప్రశ్నించారు. ఉక్కును కాపాడుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకు రావాలని, ఇతర పార్టీలతో కలుపుకుని ఢిల్లీ యాత్ర చేపట్టాలని కోరారు. మోడీతో మాట్లాడి ఫ్యాక్టరీకి ముడిసరుకు, పెట్టుబడులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయకుండా పోరాటం చేసేవారిపై రాళ్లు వేస్తోందన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ… బిజెపి హఠావో, దేశ్ కో బచావో అనే కార్యక్రమాన్ని పూనుకున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశానికి ఏం చేసింది? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసిందా? కార్పొరేట్లకు కొమ్ము కాసిందా? అనే అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనం వెనక్కి తీసుకొస్తామని, ధరలను నియంత్రిస్తామని 2014 ఎన్నికల సమయంలో మోడీ హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. వీటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగాల కల్పన లేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండ్ర్ ధర రూ.400ఉంటే బిజెపి నాయకులు ధర్నాలు చేశారని, ప్రస్తుతం సిలిండర్ రూ.1200లకు చేరుకుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటాయని వీటిపై కేంద్రమంత్రులు, బిజెపి నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురాకపోగా, బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకొని విదేశాలకు వెళ్తున్న వారికి సహకరిస్తున్నారని విమర్శించారు. విదేశాలకు వెళ్లిన వారు మోడీ, అమిషాకు ఆప్తమిత్రులని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ అంబానీ, అదానీల ఆస్తులు పెంచేందుకు ఉత్సాహం చూపుతోందన్నారు. పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. విభజన హామీలు అమలు చేయలేదని, పదేళ్లు ఇస్తామన్న ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయం అంటున్నారని తెలిపారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు ఏర్పాటు కాలేదన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు నిధులు ఇవ్వలేదన్నారు. విశాఖ స్టీల్‌ను అదానీకి అప్పగించేందుకు నరేంద్రమోడీ, జగన్ లాలూచీ పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రచార భేరి సాగుతుందని తెలిపారు. ఈ భేరి తరువాత కూడా ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని తెలిపారు. నరేంద్రమోడీ గద్దె దిగేవరకు పోరాటాల్లో, ఎన్నికల్లో కలిసి కట్టుగా ముందుకెళ్లి దేశానికి పట్టిన పీడను వదిలిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, వి.వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్ పాల్గొన్నారు.