DailyDose

హైదరాబాద్​​ రెండో రాజధాని కావాలన్న అంబేడ్కర్ ఆశయం నెరవేరలేదు

హైదరాబాద్​​ రెండో రాజధాని కావాలన్న అంబేడ్కర్ ఆశయం నెరవేరలేదు

అంబేడ్కర్​ మనవడు ప్రకాశ్​ అంబేడ్కర్​

హైదరాబాద్ : ప్రస్తుతం అభివృద్ధిలో దేశానికి తెలంగాణ కొత్త దారి చూపుతోందని బీఆర్​ అంబేడ్కర్​ మనవడు ప్రకాశ్​ అంబేడ్కర్​ పేర్కొన్నారు. అలాగే దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్​నే ఉండాలనే అంబేడ్కర్​ ఆశయం నెరవేరలేదన్నారు. హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్​నే ఉండాలనే బీఆర్​ అంబేడ్కర్​ ఆశయం నెరవేరలేదని ఆయన ముని మనవడు ప్రకాశ్​ అంబేడ్కర్​ తెలిపారు. హైదరాబాద్​లోని హుస్సేన్​ సాగర్​ వద్ద నెలకొల్పిన 125 అడుగుల బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాజ్యాంగ నిర్మాత ఆశయాల, కీర్తిని గురించి ప్రసగించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్​, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బీఆర్​ అంబేడ్కర్​ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్​కు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకాశ్ అంబేడ్కర్​ పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం ఆయన భావజాలం ఎంతో అవసరమని, తన ఆదర్శాలను పాటించడమే మనం అందరం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. స్వాతంత్య్రం రాక ముందు ఆంగ్లేయులు భారతావనిని ఏ విధంగా దోచుకున్నారో గ్రహించి 1923లోనే రూపాయి సమస్యపై ఒక పరిశోధన పత్రాన్ని రాశారని కొనియాడారు.అంటరానితనాన్ని పారద్రోలడానికి బీఆర్​ అంబేడ్కర్​ ఎంతగానో కృషి చేశారని ప్రకాశ్​ అంబేడ్కర్​ వివరించారు. నవ భారతంలో కొన్ని అతిచిన్న కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు ఇక్కడి సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కూడా కేసీఆర్​ ముందుకు తీసుకెళుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

హైదరాబాద్​ గురించి ఆనాడే చెప్పిన రాజ్యాంగ రూపశిల్పి

చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు ముందుగా అంబేడ్కర్​ మద్దతిచ్చారని ఆయన మనువడు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన ప్రాణ త్యాగం చేసేవరకు సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగిందన్నారు. రూపాయి బలోపేతం, దాని ఆవశ్యకతను ఆనాడే అంబేడ్కర్​ నొక్కి చెప్పారని తెలియజేశారు. దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అందుకు హైదరాబాద్​నే సరైందని చెప్పారు. ఎందుకంటే పాక్​, చైనా నుంచి భాగ్యనగరం ఎంతో దూరంలో ఉందని భావించి ఆనాడే ఎంతో దూరదృష్టితో ఆలోచించారన్నారు.

తెలంగాణ దేశానికి కొత్త దారి చూపింది

ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకులు కరువయ్యారన్నారు. వాజ్​పేయి వంటి జాతీయ నాయకులు కనిపించట్లేదని ఆవేదన చెందారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి కొత్తదారి చూపించిందన్నారు. జాతి, ధర్మాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలని బీఆర్​ అంబేడ్కర్​ ముని మనవడు ప్రకాశ్​ అంబేడ్కర్​ కోరారు.

“దళితబంధును ప్రారభించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఆర్ధిక దుర్భలత్వంపై ఎలా పోరాడాలో దేశానికి ఒక మార్గం చూపారు. పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం.. కొత్త దిశ చూపించింది. అంబేడ్కర్‌ జయంతి రోజు ఆయన ఆర్ధిక ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు కేసీఆర్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.