రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపిస్తూ అయిదు హాంకాంగ్, చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై చైనా శనివారం తీవ్రంగా ఖండించింది. రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూపునకు ఉక్రెయిన్పై అంతరిక్ష ఉపగ్రహ చిత్రాలను అందించిందని గత ఫిబ్రవరిలో స్పేస్టీ చైనా అనే సంస్థపై కూడా అమెరికా ఆంక్షలు వేటు వేసింది.
రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపిస్తూ అయిదు హాంకాంగ్, చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై చైనా శనివారం తీవ్రంగా ఖండించింది. రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూపునకు ఉక్రెయిన్పై అంతరిక్ష ఉపగ్రహ చిత్రాలను అందించిందని గత ఫిబ్రవరిలో స్పేస్టీ చైనా అనే సంస్థపై కూడా అమెరికా ఆంక్షలు వేటు వేసింది. అప్పట్లో ఈ వ్యవహారంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు చైనాతోపాటు మాల్టా, తుర్కియే, సింగపూర్ తదితర దేశాలకు చెందిన 28 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.
అయితే ఈ కంపెనీలన్నీ రష్యాతో గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా వ్యాపారం చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగించడానికి ఈ లావాదేవీలు రష్యాకు సహాయపడుతున్నాయని చెబుతోంది. రష్యాతో వ్యాపారం చేస్తారా లేక అమెరికాతో చేస్తా అన్నది ఆ కంపెనీలు తేల్చుకోవాల్సి ఉంటుంది. అమెరికా ఆంక్షలు విధించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కంపెనీలపై ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమనీ చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. అమెరికా తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది.