ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 142 కోట్ల 86 లక్షల జనాభాతో భారత్.. చైనాను అధిగమించిందని తెలిపింది.
జనాభా అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ అధిగమించింది. 142 కోట్ల 86 లక్షల జనాభాతో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస.. బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచింది.
భారత్ కన్నా 29 లక్షల మంది తక్కువ
జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ (UNFPA) తాజా నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో కల్లా భారత్లోనే అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు ప్రకటించింది. భారత్తో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది జనాభా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్బిహార్, యూపీలో యువతే ఎక్కువ
కొత్త UNFPA నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో 0-14 సంవత్సరాల మధ్య వయస్సులో 25 శాతం మంది ఉన్నారు. 10-19 సంవత్సరాల వయసులో 18 శాతం, 10-24 సంవత్సరాల వయసులో 26 శాతం, 15 నుంచి 64 సంవత్సరాల వయస్సులో 68 శాతం, 65 సంవత్సరాల కంటే ఎక్కువ 7 శాతం మంది ఉన్నారు. కేరళ, పంజాబ్లో వృద్ధులు ఎక్కువ ఉండగా.. బిహార్, ఉత్తర్ప్రదేశ్లో యువత అధికంగా ఉన్నారు.
మూడులో ఒకటో వంతు భారత్, చైనాలోనే!
ప్రపంచ జనాభా 800కోట్లకుపైగా అయితే అందులో మూడులో ఒకటో వంతు జనాభా కేవలం భారత్, చైనాలోనే ఉంటుందని అంచనా. కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్లో కొంతమేరకు క్షీణత కనిపిస్తోంది. 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2శాతం పెరుగుతూ వస్తుండగా.. అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ వృద్ధి 1.7శాతంగా ఉంది. గతేడాది చైనా గణాంకాల ప్రకారం అక్కడ గత ఆరు దశాబ్దాల్లో తొలిసారి భారీగా జనాభా క్షీణించినట్లు వెల్లడైంది. భారత దేశ జనాభా 165 కోట్లకు చేరుకోవడానికి ముందు.. దాదాపు మూడు దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆందోళన వద్దు!
అయితే భారత్లో జనాభా వేగంగా పెరుగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్ఎఫ్పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్నార్ తెలిపారు. జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు. భారత్లో 2011లో జనగణన జరిగింది. తిరిగి 2021లో వాటిని చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా జాప్యమైంది.