కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
పరుష పదజాలంతో ఇరువురు నాయకులు పరస్పరం మాటల తూటాలు వదులుతున్నారు. గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి 10 మంది పోటీ పడుతున్నారంటూ చింతమనేని వ్యాఖ్యానించడంతో మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు పుట్టినరోజు, ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా పాత గన్నవరంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో చింతమనేని ఈ వ్యాఖ్యలు చేశారు.
చింతమనేని దమ్మేంటో అందరికీ తెలుసు
చింతమనేని వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చు. కేఏ పాల్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టడం సహజం. కోడిపందాలు, పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుంచి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా ఉండి ఇసుక మాఫీయాతో కలిసి అధికారులపై దౌర్జన్యం చేసిందెవరో? 23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా? 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా? టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టే చంద్రబాబు చివరి ఎన్నిక అంటున్నాడ’ ని కౌంటర్ ఇచ్చారు.
వంశీపై చింతమనేని హాట్ కామెంట్స్
వల్లభనేని వంశీపై చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రంజాన్ సందర్భంగా హనుమాన్ జంక్షన్ శివారు అప్పనవీడులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వంశీ ఒక పీకుడు గాడు. వాడి గురించి తర్వాత మాట్లాడతా’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రంజాన్ లాంటి శుభదినం రోజు అలాంటి వాడి గురించి మాట్లాడబోనని చెప్పారు. కాగా, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రేషన్ కార్డు ఉన్న వారికి కార్డుకి 1 కేజీ మటన్ చొప్పున చింతమనేని పంపిణీ చేశారు.
2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ పై గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత అధికార వైసీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో వంశీపై టీడీపీ నాయకులు సమయం కుదిరినప్పుల్లా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అటు వంశీ కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా చింతమనేని వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇప్పటికే కాక మీదున్న గన్నవరం రాజకీయాలు వీరిద్దరి మాటల యుద్ధంతో ఎక్కడికి దారితీస్తాయోనని స్థానికులు భయపడుతున్నారు.