కంప్యూటర్/ల్యాప్‌టాప్, స్క్రీన్ల ముందు రోజూ 8-9 గంటలు పనిచేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి సెల్ఫోన్లలో గేమ్స్ ఆడటం మొదలుపెడతారు. డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల.. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్య ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కంటి చూపు.. మనకు ఒక వరం అనే చెప్పాలి. చూపు లేని వారికే దాని విలువ బాగా తెలుసు. కానీ కంటిచూపు బాగున్నప్పుడు దాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యం చేసి కళ్లను అనవసరమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ జనరేషన్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందేసుకుని గంటల తరబడి గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తూ.. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. రోజులో ఎక్కువ భాగం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. కంప్యూటర్లపై పనిచేసే వ్యక్తుల్లో కనీసం 50-90 శాతం మంది కొన్ని రకాల సమస్యల బారిన పడతారని పరిశోధనలు చెబుతున్నాయి. కంప్యూటర్ వాడకం వల్ల వచ్చే కంటి సమస్యలను ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అంటారు. ఇది కంట్లో ఒత్తిడి, నొప్పిని కలిగిస్తుంది. అసలు కంప్యూర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుంది? లక్షణాలు, ఎలా నివారించాలి అనే అంశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే..?
డిజిటల్ స్క్రీన్ నుంచి వచ్చే లైట్ కళ్ల మీదు పడినప్పుడు దానికి తగినట్లుగా కళ్లు చూపును అడ్జెస్ట్ చేసుకుంటాయి. అప్పుడే లైట్ కంటి రెటీనాపై సరిగా పడుతుంది. దీని వల్ల వస్తువులను స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎక్కువ సమయం ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్ ముందు గడుపుతుంటే కళ్ల కండరాలపై ఒత్తిడి పెరిగి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌కు దారి తీస్తుంది.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కారణంగా తలనొప్పి, కళ్లు పొడిబారడం, చూపు మసకగా మారడం, చదివేప్పుడు ఇబ్బందులు, ఏకాగ్రత లేకపోవడం, చిన్నపాటి కాంతిని కూడా కళ్లు తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.