ఒక్కో వ్యక్తిపై రూ.2 లక్షల భారం : చంద్రబాబు
అమరావతి, సూర్య ప్రత్యేక ప్రతినిధి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పర్యటనలో స్వయనా రాష్ట్ర మంత్రి తనపై దాడి చేయించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ దాడిలో తన భద్రతా అధికారికి రాళ్లు తగిలి గాయపడ్డారని వివరించారు. సాక్షాత్తు ఒక మంత్రి ఈ విధంగా చేయిస్తే ప్రభుత్వ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు పర్యటన విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ బాబు రోడ్డు షోనేపథ్యంలోనే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపించాయి. చీకట్లో సైతం చంద్రబాబు రోడ్ షో కొనసాగించారు. అనంతరం జైల్‌సింగ్ నగర్ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. అమరావతిని పూర్తిగా నాశనం చేశారని, రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడారని చంద్రబాబు ఆరోపించారు.
ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రావట్లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని, జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతున్నారని.. జగన్‌ను నమ్ముకున్న వ్యక్తులు జైలుకు వెళ్లారని అన్నారు. అధికారులు తప్పు చేస్తే జైలుకు వెళ్తారని.. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టను.. శిక్ష తప్పదు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత లక్ష్యమని, త్వరలో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. ప్రజలపై దాదాపు రూ.5 లక్షల కోట్లు అదనపు భారం మోపారని మండిపడ్డారు. జగన్ రూ.2 లక్షల కోట్లు అవినీతి చేసిన ఘనుడని విమర్శించారు. వంకర శంకరరావు ప్రజలను దోచుకుంటున్నారని.. దోటుకున్న ఆదాయమంతా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందని విమర్శించారు. జగన్ ప్రజల రక్తాన్ని తాగుతున్న జలగ.. అంటూ మండిపడ్డారు. సంపద సృష్టించట్లేదు.. అప్పులు మాత్రం తెచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.2 లక్షల అప్పు ఉందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టీడీపీ మాత్రమే గాడిలో పెడుతుందని పేర్కొన్నారు. టీడీపీ పేదల పక్షాన ఉండే పార్టీ అని చంద్రబాబు వెల్లడించారు.
జగన్.. సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మంత్రి నాపై రాళ్లతో దాడి చేయించారని.. ఈ దాడిలో తన భద్రతా అధికారికి రాళ్లు తగిలి గాయపడ్డారని చంద్రబాబు వెల్లడించారు. సాక్షాత్తు మంత్రి ఈవిధంగా చేయిస్తే ప్రభుత్వ కుట్ర కాదా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలించిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి అంటరానితనాన్ని రూపుమాపినట్లు చంద్రబాబు వెల్లడించారు. తాము అధికారంలో ఉండగా.. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకువచ్చినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఎస్సీల్లో వెనుకబాటుతనం ఉంటే న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని తెలిపారు. దేశంలో తొలిసారి ఎస్సీలో కేటగిరీలు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ అని చంద్రబాబు వెల్లడించారు. బీసీలకు 35 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చామని పేర్కొన్నారు. జగన్ వచ్చాక రిజర్వేషన్లను 10 శాతం తగ్గించారని మండిపడ్డారు.ప్రజా వేదిక విధ్వంసంతో వైసీపీ పాలన ప్రారంభమైందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల జీవితాలను నాశనం చేసేందుకే జగన్ వచ్చారని విమర్శించారు. ఎన్నికలకు మరో 10 నెలలు మాత్రమే గడువు ఉందని.. ఎన్నికల అనంతరం ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు. ఏం చేశారని వైసీపీ నేతలు ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి.. ప్రతి కుటుంబాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు.
వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు ఎనిమిదిసార్లు పెంచారని.. ప్రతి నెలా యూనిట్‌కు 50 పైసలు పెంచుతూనే ఉన్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు పది రూపాయలు ఇచ్చి ప్రజల వద్ద వంద రూపాయలు దోచుకున్నారంటూ ఎద్దేవాచేశారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని.. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చామని చంద్రబాబు వెల్లడించారు.
సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీయే అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రానికి, దేశానికి టీడీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. సంపద సృష్టించడానికి టీడీపీ శ్రీకారం చుట్టిందనీ.. సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. నాటి ప్రధాని వాజ్‌పేయీ జాతీయరహదారులను ప్రారంభించారని అయితే, జాతీయరహదారులకు సూచనలు ఇచ్చింది టీడీపీ అని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ హయాంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. టీడీపీ చొరవ వల్ల లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయని చంద్రబాబు తెలిపారు.