WorldWonders

కాలభైరవుడు అలా ఆవిర్భవించాడు

కాలభైరవుడు అలా ఆవిర్భవించాడు

ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే విగ్రహం భైరవుడు. భయాన్ని కలిగించేలా ఆయన రూపం వుంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా కనిపిస్తుంటాడు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో … వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు.

భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. ఎదుట నిలిచినది ఎలాంటి శక్తి అయినా ఆయన ధాటిని తట్టుకుని నిలబడటం కష్టమనిపిస్తుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు … శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడు నుంచి ఆవిర్భవించినవాడే.

తనని అవమానపరచడమే కాకుండా, తనకి సతీదేవిని దూరం చేసిన దక్షుడిపై శివుడు ఉగ్రుడవుతాడు. వీరభద్రుడిని సృష్టించి దక్షుడి శిరస్సును ఖండింపజేస్తాడు. అలాగే తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై కూడా శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే ‘భైరవుడు’ ని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.

మహా పరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో, ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు. ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమనీ, ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో, అక్కడితో ఆయన పాపం ప్రక్షాళన అవుతుందని శివుడు చెబుతాడు.

భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు ‘బ్రహ్మ కపాలం’ గా పిలవబడుతోంది. ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. ఆ తరువాత అనేక శైవక్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక శిలగా ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ వుంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందనీ, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.