Politics

రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా పవర్ కట్.. 9 నిమిషాలు చీకట్లోనే ఆడిటోరియం

రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా పవర్ కట్.. 9 నిమిషాలు చీకట్లోనే ఆడిటోరియం

ఒడిశా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఊహించని అనుభవం ఎదురైంది.ఆమె సొంత జిల్లాలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తుండగా కరెంట్ పోయింది. కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఒడిశా వచ్చారు. మయూర్ భంజ్ లో మహారాజ శ్రీరామచంద్ర భంజ్ దేవ్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఆమె ప్రసంగిస్తుండగా కరెంట్ పోయింది. దీంతో ఆమె దాదాపుగా 9 నిమిషాల పాటు చీకటిలోనే మాట్లాడారు. అయితే దీనిపై విచారం వ్యక్తం చేసిన పౌరసంబంధాల శాఖ అధికారులు ఆడిటోరియంకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదన్నారు. లోపల వైరింగ్ లో తలెత్తిన లోపం కారణంగానే పవర్ పోయిందని స్పష్టం చేశారు.

అయితే డిగ్రీ పట్టాలు పొందినంత మాత్రాన విద్య అనేది ముగిసిపోదని..అది నిరంతర ప్రక్రియ అని ముర్ము అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించాక కొంత మంది ఉద్యోగం సాధిస్తారు.. కొంత మంది వ్యాపారం, పరిశోధన చేస్తారు.. కానీ ఉద్యోగం చేయడం కంటే ఇవ్వడం గొప్ప విషయాన్నారు రాష్ట్రపతి.

దాతృత్వం, సహకారం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. విద్యార్థులు తమ సంతోషాల గురించి మాత్రమే ఆలోచించ కుండా సమాజం, దేశ సంక్షేమం కోసం కూడా ఆలోచించాలని రాష్ట్రపతి అభిప్రాయ పడ్డారు. కృషి, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్నారు.