కీవ్‌ః ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హఠాత్తుగా బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… రిషి సునాక్ తో భేటీ కానున్నట్టు తెలిపారు. తన సైన్యం, వాయుసేన సామర్థ్యాలను పెంచుకునే విషయంలో యూకే పాత్ర కీలకమని చెప్పారు. యూకే సహకారం ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు.
మరోవైపు జెలెన్ స్కీ పర్యటనపై రిషి సునాక్ కూడా స్పందించారు. ఉక్రెయిన్ ను తాము వదిలేయబోమని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి సంబంధించి ఇది కీలక సమయమని చెప్పారు. ఇప్పుడు యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ భూభాగం లోపల ఉందని… కానీ దీని ప్రభావం మాత్రం ప్రపంచమంతా ఉందని అన్నారు. పుతిన్ కు ప్రతిఫలం దక్కకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేసేందుకు యూకే సిద్ధంగా ఉంది. ఈ మేరకు గత గురువారం బ్రిటన్ నుంచి ప్రకటన వెలువడింది.