ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తలు, పలు పథకాల లబ్ధిదారులతో ఆయేన సమావేశం అయ్యారు. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా ఉండటానికి నరేంద్రమోడీ వంటి బలమైన నాయకుడు ప్రధాని ఉండటం ఉపయోగపడిందని ఆయన అన్నారు. శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమైన ‘మహావికాస్ అఘాడీ’(ఎంవీఏ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే అన్ని మంచి పథకాలకు విరామం ఇచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ఏక్ నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు.