NRI-NRT

భారత విద్యార్థులపై ఆస్ట్రేలియా వీసాల ఆంక్షలు….

భారత విద్యార్థులపై ఆస్ట్రేలియా వీసాల  ఆంక్షలు….

ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులకు షాక్ ఇచ్చాయి. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులు స్వీకరించవద్దని ఫెడరేషన్‌ యూనివర్సిటీ, వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్‌ ఏజెంట్లకు తాజాగా సూచనలు జారీ చేశాయి.

ఈ అంశంపై ఇప్పటికే వ్యక్తిగతంగానూ మెయిల్స్‌ పంపినట్లు ఫెడరేషన్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ రాష్ట్రాల విద్యార్థులు చేస్తున్న దరఖాస్తుల్లో చాలావరకు వాస్తవమైనవి కాదని, మోసపూరితంగా ఉన్నాయని ఆస్ట్రేలియా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించడం వల్లే వీసాల మంజూరును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. భారత్‌ నుంచి వచ్చిన వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం గత పదేళ్లలో ఇదే గరిష్ఠమని, మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 25 శాతం మోసపూరితంగా ఉన్నాయని అక్కడి వర్గాలు వెల్లడించాయి. కనీసం రెండు నెలలపాటు ప్రస్తుత నిషేధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.