ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి? వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం వేదకాలం నుంచి వస్తోన్న ఆచారం. ఇందుకోసం పెట్టిన ముహూర్తమే ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక పౌర్ణమి జరుపుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే:-
వ్యవసాయాన్ని ఓ యజ్ఞంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఈ వేడుకను జ్యేష్ఠ పౌర్ణమిరోజే ఎందుకు జరుపుకుంటారంటే. ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే. కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ‘ఏరువాక’ అని పేరు అంటే వ్యవసాయ పనుల ప్రారంభించడం అని అర్థం.
జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక ఎందుకు?
సస్యానికి అధిపతి చంద్రుడు ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం సెంటిమెంట్.
భారతీయ జీవన విధానానికి వ్యవసాయం మూలస్తంభం, భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి వ్యవసాయం మూలస్తంభం లాంటిది. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్య వనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ ‘కృషిపూర్ణిమ’ దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లతో పిలవబడుతుంది. ‘ఏరు’ అంటే నాగలి అని, ‘ఏరువాక’ అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు.
రైతులు ఈ పండుగను ఎందుకు జరుపుతారు ? రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు (మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు.
పంట పొలం దైవ క్షేత్రం, పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు.
ఏరువాకకి ఎన్ని పేర్లో, ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదం ఏరువాకను ‘అనడుత్సవం’గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం ఏరువాకను సీతాయజ్ఞంగా వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం.
కొన్ని ప్రాంతాలలో ఊరు బయట, గోగునారతో చేసిన తోరాలు కడతారు. రైతులంతా అక్కడికి చేరి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని నమ్ముతారు