Politics

ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగ సభ….

ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగ సభ….

ఖమ్మంలో గురువారం జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి లక్ష మందిని సభకు తరలించాలని నాయకులకు సూచించారు. సభ విజయవంతానికి సీనియర్‌ నాయకులతో కమిటీని నియమిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని ముగిసిందని, జాకీ పెట్టినా లేచే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు. భాజపా గ్రాఫ్‌ను దెబ్బతీసేందుకు భారాస, కాంగ్రెస్‌ పనిచేస్తున్నాయని ఆరోపించారు. అమిత్‌షా సభ తర్వాత కొత్తగూడెంలో ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసి అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో సభాస్థలిని సంజయ్‌ పరిశీలించారు. పార్టీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.