Editorials

కాగల కార్యం గంధర్వులే తీర్చారు….

కాగల కార్యం గంధర్వులే తీర్చారు….

మనం ఒక పని పూర్తి చేయాలని తలపెడితే, అనుకోకుండా ఆ పనిని మరొకరు పూర్తి చేస్తే అప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటాం. ఒక రైతు తన పొలానికి మోటారు ద్వారా నీరు పెట్టాలని అనుకుని రాత్రి నిద్రపోయాడు. తెల్లవారేసరికి పెద్ద వాన పడి పొలమంతా తడిచింది. ఇలాంటి సంఘటనలనే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటారు. ఈ నానుడి మహా భారతంలో జరిగిన ఓ ఘట్టం నుండి వచ్చింది. ఆ కథ ఏమిటో చూద్దాం.
శకుని పాచికల ఆటలో పాండవులు ఓడి అరణ్యవాసం వెళ్లిపోయారు. చాలా రోజులు గడిచిన తరువాత దుర్యోధనుడికి ఓ దురాలోచన కలిగింది. పాండవులు ఎలా ఉన్నారో చూసి, వారికి తన వైభోగం చూపించి అవమానించాలనే తలంపు కలిగింది. వెంటనే తన పరివారంతో ఘోషయాత్ర పేరుతో అరణ్యంలోకి బయలుదేరాడు. అరణ్య మధ్యలో ఓ గంధర్వుడు దుర్యోధనుడి పరివారంతో యుద్ధం చేసాడు. గంధర్వుడి చేతిలో దుర్యోధనుడు ఘోరాతి ఘోరంగా ఓడి పోయి పట్టుబడ్డాడు. గంధర్వుడు దుర్యోధనుడిని బంధించి రథంలో కట్టి పడేసాడు. దుర్యోధనుడి పరివారంలో ఒకడు తప్పించుకుని పాండవుల వద్దకు వెళ్లి శరణు వేడాడు. దుర్యోధనుడిని కాపాడమని అడిగాడు. గంధర్వులు చేతిలో ఓడిపోయి అభాసుపాలైన దుర్యోధనుడి భంగపాటును పాండవులు చర్చించుకునే సందర్భంలో భీముడు అన్న మాటలు ఇవి. దుర్యోధనుడు అనుకున్నది ఒకటి. అయింది మరొకటి. పాండవులను భంగపరచాలని వచ్చి తానే భంగపడ్డాడు. తాము చేయాలనుకున్న పనిని గంధర్వులే చేశారు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని పెద్దగా నవ్వుతాడు భీముడు. ఇది ఈ కాగల కార్యం గంధర్వులే తీర్చారు కథ.
ఈ కథ ఆధారంగా మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు అనుకోకుండా అది మరోవిధంగా లేదా మరొకరోచే విజయవంతంగా పూర్తయితే దాన్ని కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనే నానుడితో వాడుకలోకి వచ్చింది.