DailyDose

వివేకా హత్యకేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు – TNI నేటి నేర వార్తలు

వివేకా హత్యకేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు - TNI నేటి నేర వార్తలు

* తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ సమీపంలోని ఫొటో ఫ్రేమ్స్ తయారీ షాపులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మాడవీధుల్లో రాకపోకలను నిలిపివేశారు.

వివేకా హత్యకేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకాంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌(Remand)ను సీబీఐ కోర్టు పొడిగించింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితులను శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. విచారణ సందర్భంగా ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ తెల్లవారుజామున చొరబాట్లకు యత్నించిన ముష్కరులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఇరు వర్గాల మధ్య కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్లో ఈ ఏడాది ఇదే అతిపెద్ద చొరబాటు ఆపరేషన్.

రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన సెల్ ఫోన్

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. రాష్ట్రంలోని కర్నూలు నంద్యాల జిల్లాలో ని మహానంది మండలం లో సెల్‌ఫోన్ గేమింగ్ సంబంధించి బసవాపురం, గాజులపల్లె గ్రామాల యువకుల మధ్య వివాదం జరిగింది.ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు. ఇక యూత్ అయితే ఫోన్లో గేమ్స్ తో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు. అయితే నాలాడ్జ్ పెంచుకోవడం మాత్రమే కాదు సెల్ ఫోన్ వల్ల రెండు గ్రామాల్లో గొడవలు కూడా జరిగాయి. గేమింగ్‌కు సంబంధించి కొంతమంది యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం వారు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామంపై దాడికి దిగడం కలకలం రేపుతోంది.

* కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం

కెనడాలోని మనిటోబ ప్రావిన్స్‌లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ట్రక్కు.. మినీ బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మొత్తం వృద్ధులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కెనడా చరిత్రలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. నైరుతి మనిటోబలోని కార్‌బెర్రీ నగరంలోని రెండు ప్రధాన రోడ్లు కలిసే చోట ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. 10 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మినీ బస్సును ట్రక్కు ఢీకొనడంతో అది పూర్తిగా కాలిపోయినట్లు ఘటనా స్థలంలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రోడ్డుపై పడిన మృతదేహాల సమీపంలో వీల్‌ ఛైర్లు, వాకర్లు ఉన్నాయి. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్విటర్‌లో స్పందించారు.

దేవరకొండలో యువకుడు సెల్ఫీ సూసైడ్‌

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం చింతబావి గ్రామంలో దారుణం జరిగింది. చెట్టుకు ఉరేసుకొని శంకర్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన ఆత్మహత్యకు అత్త, మామ, బావమరిదే కారణం అంటూ వీడియోలో తెలిపాడు. అలాగే తన బిడ్డను కాపాడాలని కోరాడు. గత మూడు నెలల క్రితం శంకర్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలోని ఇద్దరు యువకుల వేధింపులతోనే శంకర్‌ భార్య ఆత్మహత్య చేసుకుందని.. ఆ అంశంలో ఓ మండల ప్రజాప్రతినిధి సెటిల్‌మెంట్‌ చేసి డబ్బులు ఇప్పించారు. అయితే డబ్బుల విషయంలో అత్తమామల టార్చర్‌ భరించలేకనే శంకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

*  పదోతరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పదోతరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దుండగుల దాడిలో తీవ్రగాయాలైన విద్యార్థిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.. అయితే అప్పటికే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చనిపోయిన విద్యార్థి ఉప్పలవారి పాలెం గ్రామానికి చెందిన అమర్నాథ్‌గా పోలీసులు గుర్తించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

నాటు తుపాకితో భార్యను కాల్చి పరారయ్యాడో భర్త. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. భోజ్యాతండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాకు చెందిన లావుడ్యా సామ-శాంతి భార్యాభర్తలు. గత రాత్రి భార్యతో గొడవ పడిన సామ నాటుతుపాకితో ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

*   సాయికృష్ణతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన ప్రియురాలిని కిరాతకంగా హతమార్చిన ఘటనలో నిందితుడు సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతించింది. ఈనేపథ్యంలో శంషాబాద్‌ పోలీసులు సాయికృష్ణను గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ రాత్రి నిందితుడిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. తద్వారా అప్సర హత్యకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించనున్నారు. శనివారం మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.

* అందరికంటే ముందే నిద్రలేచిన ఐదేళ్ల చిన్నారి

ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌లోని 8వ ఫ్లోర్‌ బాల్కనీ నుంచి కింద పడి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శుక్రవారం (జూన్ 16) ఈ సంఘటన చోటుచేసుకుంది.నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని హైడ్ పార్క్ సొసైటీ అపార్ట్‌మెంట్ వద్ద తెల్లవారుజామున 5:45 గంటలకు ఈ ఘటన జరిగింది. హుటాహుటీన చిన్నారిని సెక్టార్‌ 71లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించిన ఫలితంలేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన సమయంలో చిన్నారి తల్లిదండ్రులు నిద్రిస్తున్నారని పోలీసులు తెలిపారు.

బిపర్‌జోయ్ తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదు

బిపర్‌జోయ్ తుపాను నిన్న సాయంత్రం తీరాన్ని తాకిన తర్వాత గుజరాత్‌లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదని NDRF డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ శుక్రవారం ప్రకటించారు. అయితే కొండచరియలు విరిగిపడకముందే ఇద్దరు చనిపోయారని, కొండచరియలు విరిగిపడిన తర్వాత ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఇరవై నాలుగు జంతువులు చనిపోయాయని, 23 మంది గాయపడ్డారన్నారు. దాదాపు వెయ్యి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, 800 చెట్లు నేలకూలాయన్నారు. రాజ్‌కోట్‌లో తప్ప ఎక్కడా భారీ వర్షాలు కురువలేదన్నారు.