NRI-NRT

ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం

ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం

ఎయిర్ పోర్టుల్లో తెల్లటి యూనిఫాంతో పనిచేసే ఉద్యోగుల మధ్య నెత్తిన టోపీ, యూనిఫాంతో ఓ పిల్లి ఠీవీగా తిరుగుతోంది. సదరు పిల్లి పేరు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. చిన్నా పెద్దా ఆఫీసర్లు మోరిస్ ను మర్యాదగా చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న ప్రయాణికులు ఆ పిల్లి కచ్చితంగా ఎవరో పెద్ద ఉద్యోగస్తుడి పెంపుడు పిల్లి అయి ఉంటుందని అనుకున్నారు. కానీ, ఆ ఎయిర్ పోర్టులో మిగతా ఉద్యోగుల తరహాలోనే సదరు పిల్లి కూడా ఓ ఉద్యోగి అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఎదురైన వింత అనుభవం.

ఇంతకీ విమానాశ్రయంలో ఆ పిల్లి చేసే పనేంటంటే.. మొదటిసారి విమాన ప్రయాణం చేయడం వల్లో లేక విమాన ప్రయాణమంటే భయంవల్లో కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారట. అలాంటి ప్రయాణికుల వల్ల విమానాశ్రయంలో, విమాన ప్రయాణంలో చాలాసార్లు గందరగోళం నెలకొంటుందని అధికారులు చెప్పారు. వారి ఆందోళనను తగ్గించడమే ఈ పిల్లిగారి పని. ఈ పిల్లితో కాసేపు గడిపితే ప్రయాణం గురించిన టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఆపై భయపడకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నెర్వస్ ను పోగొట్టేందుకు ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని వివరించారు.