ఫిలడెల్ఫియాలో జులై 7,8,9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ ద్వైవార్షిక మహాసభల్లో నిర్వహించబోయే మహిళా ఫోరం కార్యక్రమాలు వైవిద్యభరితంగా, ఆలోచన రేకెత్తించేలా, విలువైన సలహాలు సూచనల పరస్పర అవగాహనకు వేదికగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని 23వ తానా సభల మహిళా ఫోరం ఛైర్‌పర్సన్ అడ్లూరి శైలజ TNIకు ఇచ్చిన ముఖాముఖిలో పేర్కొన్నారు. గత తానా మహాసభల్లో నిర్వహించిన మహిళా కార్యక్రమాలకు కన్నా కాస్త విభిన్నంగా ఈసారి రెండు రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు ఆమె తెలిపారు.
రెండోరోజు శనివారం కార్యక్రమాల్లో భాగంగా “మహిళా సాధికారత” (Women Empowerment), మూడోరోజు ఆదివారం కార్యక్రమాల్లో ప్రవాస “మహిళలు తమ జీవన విధానంలో అలవర్చుకోవల్సిన సంస్కరణలు” (Reforms To Transform Women’s Lives) అనే అంశాలపై ప్యానెల్ చర్చలు ఉంటాయని శైలజ తెలిపారు.
గృహహింస, మహిళా ఆరోగ్యం, స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర, పాఠశాల కమిటీల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం, లైంగిక వేధింపులు, అంతరిక్షంలో మహిళలు వంటి వినూత్నమైన అంశాలపై ప్రసంగాలు, చర్చలకు ఈసారి జరిగే తానా సభల్లో మహిళా ఫోరం గొడుగు పడుతుందని అడ్లూరి వెల్లడించారు.
మందలపు కవిత, మెడిది శైలజ, నాదెళ్ల విజయ, గనేశుల సుష్మ, అరసద భాను, పాలడుగు మంజీర, శ్రీ గురుసామి(నటి రాజసులోచన కుమార్తె-చికాగో డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు)లు ఈ ఫోరం ప్రతినిధులుగా సేవలందిస్తారని, అధ్యక్షుడు అంజయ్య, కన్వీనర్ పొట్లూరి రవిల ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన హాలు ఎదురుగా ఉన్న రూం నెం.201లో ఈ ఫోరం చర్చా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
23వ తానా సభల్లో నిర్వహించే మహిళా ఫోరంకు హాజరయ్యే అతిథుల జాబితాలో శ్రీలీల, లయ, కౌసల్య, సునీత, అనసూయ, వ్యోమగామి బండ్ల శిరీష, డా.సుష్మ, చంద్రబోస్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
వివరాలకు https://tanaconference.org/ చూడవచ్చు.