తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉందని దాన్ని ఎవరు చెరిపివేయలేరన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ దశాబ్ధాలుగా పోరాటం చేసి అద్భుత పాలన అందించిందని చెప్పుకొచ్చారు.
గుంటూరులోని రాష్ట్ర కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతల సూచలన మేరకే గుంటూరులో రాష్ట్రా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి నుంచి గుంటూరు నుంచే రాష్ట్ర కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
నూతన కార్యాలయం రెడీ అయ్యేవరకు ఎక్కడ నుంచో పనిచేసే కన్నా గుంటూరు నుంచి చేయడమే సులభమని తాను భావించినట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ప్రజలు పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు.
40శాతం ఓట్లు వేసిన ప్రజల కోసం పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో నీతి వంతమైన పాలన అందించామన్నారు. తమపై నమ్మకంతో రైతులు 33వేల ఎకరాల భూమిని అప్పగించారన్నారు.
రాజకీయ పార్టీ మనుగడకు కార్యకర్తలు చాలా అవసరమన్న చంద్రబాబు 37 ఏళ్ళ పాటు పార్టీని, జెండాని మోసింది కార్యకర్తలేనని చెప్పుకొచ్చారు. పార్టీ వలన నష్టం వచ్చిన కార్యకర్తలు పార్టీతోనే ఉంటారన్నారు.
పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలేనని అయితే అలాంటి వారిపై దాడులు పెరిగాయన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారని తెలిపారు.
ప్రతీ కార్యకర్తని కాపాడుకుంటామని తాను ఇక్కడే ఉంటానని ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తప్పు చేయలేదని అరాచకాలు అస్సలే చేయలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.