బ్రిటన్ రాజకుటుంబంలో జరిగే ఘటనలన్నీ ఆసక్తికరంగానే ఉంటాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం, ప్రిన్స్ హ్యారీ రాసిన పుస్తకం, రాజుగా చార్లెస్ పట్టాభిషేకం వంటి ఘటనలతో ఇటీవల బ్రిటన్ రాజకుటుంబం పేరు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. భవిష్యత్ బ్రిటన్ రాజు ప్రిన్స్ విలియం మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు ప్రిన్స్ హ్యారీతో విభేదాలను బయట పెట్టారు.తమ కుటుంబంపై ఊహించిన దానికంటే ఎక్కువ చర్చ జరిగిందని, వివాదాలు ఉన్నా రాజ కుటుంబ సభ్యులు ప్రజాసేవకు, సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి అంకిత భాంతో ఉన్నారని ప్రిన్స్ విలియం చెప్పుకొచ్చారు. రాజకుటుంబ విషయాలు బయటి వ్యక్తులకు అర్థం కావడం కష్టం, తమ సామాజిక కార్యక్రమాలతో హ్యారీతో వివాదం ప్రజల దృష్టి నుంచి తప్పిపోయిందన్నారు. భవిష్యత్ బ్రిటన్ రాజకుటుంబ సింహాసన వారసుడిగా తాను తన తల్లి ప్రిన్సెస్ డయానా అడుగు జాడల్లో నిరాశ్రయుల సమస్య పరిష్కారానికి తమ ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నామన్నారు.
బ్రిటన్ రాజకుటుంబ వారసుడిగా తన అనుభవాలపై ప్రిన్స్ హ్యారీ.. `స్పేర్` అనే పేరుతో రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం సంచలనం సృష్టించింది. తననెప్పుడూ `స్పేర్`గానే చూశారని హ్యారీ రాసుకున్నారు. తన సోదరుడు విలియంతో గొడవ జరిగిందని, మేఘన్ మెర్కెల్‌తో పెండ్లి విషయంలో కుటుంబంతో విభేదాలు తలెత్తాయని చెప్పారు. వివాహం తర్వాత మేఘన్‌ను రాజకుటుంబం తీవ్ర వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.