* తగ్గిన బంగారం, వెండి ధరలు
ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. క్యారెట్ల 10 22 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గడంతో రూ.54,500గా ఉండగా.. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గడంతో రూ. 59,450గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ. 1500 తగ్గడంతో రూ.75,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
* నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించినప్పటికీ… వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో నిన్నటి లాభాలను కోల్పోయి చివరకు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 63,238కి పడిపోయింది. నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 18,771కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
* రెండు ఎఫ్‌డీ పథకాల గడువు పెంచిన ఎస్‌బీఐ
బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కూడా వృద్ధులకు అధిక వడ్డీ అందించేందుకు రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఆయా పథకాల్లో జాయిన్ అవ్వడానికి గడువు తేదీ సమీపించడంతో తాజాగా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఎస్‌బీఐ వుయ్ పథకం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో వృద్ధులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ పథకంలో చేరడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించారు. అలాగే తాజా డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల పునరుద్ధరణపై ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
* బయో ఇథనాల్ ప్లాంట్లకు జగన్ శంకుస్థాపన
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో నిర్మించనున్న రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లకు సిఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.925 కోట్ల వ్యవయంతో ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. క్రిబ్కో విశ్వసముద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్లాంట్లను నిర్మిస్తున్నారు. శంకుస్థాపన అనంతరం కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ ప్లాంట్ వల్ల స్థానికంగా ఉన్న దాదాపు 75 శాతం యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సిఎం జగన్ చొరవతో పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగామన్నారు. ప్లాంట్లకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం ఇచ్చామని తెలిపారు. ఈ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
* అత్యంత ప్రభావశీల 100 కంపెనీల్లో మీషో, ఎన్‌పీసీఐ
ప్రపంచ యవనికపై భారత్ ప్రాధాన్యం పెరుగుతోందంటూ రోజూ ఏదో ఒక రంగంలో వార్త వింటూనే ఉంటున్నాం. తాజాగా అలాంటి సమాచారమే మరొకటి మన ముందుకొచ్చింది. మూడు దేశీయ కంపెనీలు ప్రతిష్ఠాత్మక ‘టైమ్ 100 అత్యంత ప్రభావశీల కంపెనీలు 2023 (TIME 100 Most Influential Companies 2023)’ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితా (TIME 100 Most Influential Companies 2023)లో స్కిమ్స్, ఎన్‌విడియా, స్పేస్‌ఎక్స్, యాపిల్, ఓపెన్‌ఏఐ వంటి దిగ్గజ కంపెనీల సరసన దేశీయ ఇ-కామర్స్ సంస్థ మీషో (Meesho) చోటు దక్కించుకుంది. మన జీవితంలో భాగంగా మారిపోయిన యూపీఐ చెల్లింపులను నిర్వహిస్తున్న ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’, బ్లాక్‌చైన్ సాంకేతికతపై పనిచేస్తున్న ‘పాలిగాన్ ల్యాబ్స్’ సైతం ఈ జాబితాలో ఉండడం విశేషం.
* జగన్ వల్ల మా సినిమాలకు రూ. 30 కోట్ల నష్టం వచ్చింది: పవన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు తగ్గించడం, థియేటర్లపై ఆంక్షలు విధించడం, థియేటర్ల వద్ద అధికారులను పెట్టడం వంటివి చేయించారని ఆయన మండిపడ్డారు. జగన్ చేసిన ఈ పనుల వల్ల తన సినిమాలు హిట్ అయినప్పటికీ… ఏపీలో నిర్మాతలకు రూ. 30 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. ఆ నష్టాన్ని తానే భరించానని చెప్పారు.
* రూ.4 లక్షల కోట్లను దానం చేశారు
ప్రపంచంలో ఆరో అత్యంత ధనవంతుడు వారెన్ బఫెట్ పెద్ద మనసు చాటుకున్నారు. మిలిందా గేట్స్ సహా 5 ఫౌండేషన్లకు 13.69 మిలియన్ల హాత్వే బెర్క్ షైర్ షేర్లను దానం చేశారు. వీటి విలువ 50 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.4.09 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు. తన దగ్గర ఇంకా 112 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయని చెప్పారు ఈ అమెరికన్ వ్యాపారవేత్త.
* అప్‌డేటెట్ ఫీచర్లతో కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ రీ లాంచ్
మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్కూటర్లకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. పురుషులు, మహిళలు వినియోగించకునే వీలుండటం, సిటీ పరిధికి సరిగ్గా సరిపోతుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని కంపెనీలు విద్యుత్ శ్రేణి స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న పలు మోడళ్లలో కొత్త ఫీచర్లు యాడ్ చేసి అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఇప్పటికే తన సత్తా చూపిన కోమకి కంపెనీ ఇప్పుడు పాత మోడల్ ను సరికొత్తగా అడ్ డేట్ చేసి ఆవిష్కరించింది. కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ మోడల్ ఇప్పుడు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ తో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, విడా వీ1 ప్రో వంటి వాటితో పోటీపడనుంది.
* రూ.400 కోట్ల క్లబ్లోకి ‘ఆదిపురుష్ ‘
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్ ‘ రూ.400 కోట్ల క్లబ్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో రూ.410 కోట్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా కుటుంబసమేతంగా సినిమా చూడాలని.. టికెట్ ధరను రూ.150కు తగ్గించారు. దీంతో ఆక్యుపెన్సీ పెరిగి.. కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
* BCలకు రూ.1,00,000 సాయం.. అర్హుల గుర్తింపు ఎప్పటి వరకు అంటే?
TS: బీసీల్లోని 15 చేతివృత్తి కులాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3.80 లక్షల మంది పురుషులు, 1.48 లక్షల మంది మహిళలు ఉన్నారు. మండల స్థాయిలో MPDOలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఈనెల 26 వరకు అర్హుల గుర్తింపు ప్రక్రియను చేపడతారు. దరఖాస్తు టైంలో అప్లోడ్ చేసిన పత్రాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రతినెలా 15న లబ్ధిదారులకు రూ.లక్ష సాయాన్ని అందిస్తారు.