ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) ధన వృద్ధి (Dhan Vridhhi) పేరిట కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. నేటి (జూన్ 23) నుంచి సెప్టెంబర్ 30 వరకు పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్‌తో కూడిన సింగిల్ ప్రీమియంతో వస్తున్న లైఫ్ ప్లాన్. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది.
ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీ మొత్తం లభిస్తుంది. ఇది రెండు ఆప్షన్లలో లభిస్తుంది. మొదటి ఆప్షన్లో పాలసీదారు మరణిస్తే 1.25 రెట్లు చెల్లిస్తారు. రెండో ఆప్షన్లో ఈ మొత్తం 10 రెట్లుగా ఉంటుంది.ఈ ప్లాన్ 10, 15, 18 ఏళ్ల కాలవ్యవధితో వస్తోంది. కనీస వయసు అనేది టర్మ్ ఆధారంగా 90 రోజుల నుంచి 8 ఏళ్లు ఉంటుంది. అలాగే టర్మ్, ఆప్షన్ ఆధారంగా గరిష్ఠ వయసు 32 ఏళ్ల నుంచి 60 ఏళ్లుగా నిర్ధారించారు. కనీస హామీ మొత్తాన్ని రూ.1.25 లక్షలుగా ఎల్ఐసీ నిర్ణయించింది. ఆపై రూ.5వేల చొప్పున సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా ఎంచుకోవచ్చు.
తొలి ఆప్షన్లో ప్రతి వెయ్యి రూపాయలకి ఎంచుకున్న టర్మ్ ఆధారంగా ఏడాదికి రూ.60-75 వరకు గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. ఆప్షన్-2లో అయితే ఈ మొత్తం టర్మ్ బట్టి రూ.25-40 మధ్య ఉంటుంది. మెచ్యూరిటీ/ డెత్ సమయంలో ఐదేళ్ల కాలానికి విడతల వారీగా (నెల, త్రైమాసికం, 6 నెలలు, సంవత్సరం) సెటిల్మెంట్ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్‌పై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. సెక్షన్ 80సి కింద మినహాయింపులు పొందొచ్చు. సింగిల్ ప్రీమియం కాబట్టి ల్యాప్స్ అనే మాటే తలెత్తదు.