రానున్న శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల దృష్ట్యా ఏర్పాట్లపై ఈ రోజు హైదరాబాద్ సాలర్ జంగ్ మ్యూజియం లో బోనాల సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ బోనాల సమీక్ష సమావేశంలో భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఉరిగింపు కమిటీ సభ్యులు, పాతబస్తీ ప్రాంతాల శ్రీ మహంకాళి దేవాలయాల ప్రతినిధులు, పోలీస్, జీహెచ్‌ఎంసీ, దేవాదాయ శాఖ, విద్యుత్, నీటిపారుదల, అగ్నిమాపక, రోడ్ రవాణా, ట్రాఫిక్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లు, సమస్యల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో చర్చించి సమస్యలు పండుగ కంటే ముందే పరిష్కారం అయ్యేటట్లు ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు గొప్పగా పండుగలు జరుపుకోవాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఓల్డ్ సిటీ లోని ఆలయాలకు జులై 10 న ఆర్ధిక సహాయం పంపిణీ చేస్తామన్నారు.