‘చేతిలో భూమి ఉంది కదాని పంచుకుంటూ పోతే ఎలా? నువ్వు ఇది తీసుకో… నువ్వు అది తీసుకో అంటూ జేబులో నుంచి తీసిచ్చినట్లుగా ఎలా ఇచ్చేస్తారు’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కులాల వారీగా భూములను కేటాయించడం సరికాదని, ఇది సుప్రీం, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టంచేసింది. ఇలా కేటాయింపులు చేయడం ఒకరకంగా భూకబ్జాయేనని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్‌లో ఆలిండియా వెలమ, కమ్మ సేవా సంఘాలకు సంక్షేమ భవనాల నిర్మాణానికి అయిదెకరాల చొప్పున కేటాయిస్తూ జారీ చేసిన జీవో 47ను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఆయా సంఘాలు ఏమైనా నిర్మాణాలను ప్రారంభించి ఉంటే కొనసాగించరాదని స్పష్టం చేసింది. కుల సంఘాల సంక్షేమ భవనాలకు ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ విశ్రాంత ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వెలమ సంఘం తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు వాదనలు వినిపిస్తూ, కౌంటరు దాఖలు చేశామన్నారు. కమ్మ సేవా సంఘాల సమాఖ్య తరఫు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ… పిటిషన్ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్నామని, పిటిషన్ ప్రతులూ తమకు అందలేదని కౌంటరు దాఖలుకు గడువు కావాలని కోరారు. దాంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేస్తూ 2021లో దాఖలైన పిటిషన్లో ఇప్పటివరకు కాపీలు అందకపోవడం ఏమిటని ప్రశ్నించింది. ఇవి జాప్యం చేయడానికి ఎత్తుగడలని వ్యాఖ్యానించింది.
కమ్మ-వెలమ సంఘాలకు భూములపై హైకోర్టు స్టే
Related tags :