అమెరికా నుంచి కొనుగోలు చేయనున్న ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్లు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు సగటున 27% తక్కువ ధరకే లభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వాటిని మరింత తక్కువ మొత్తానికే దక్కించుకునేందుకు- సంప్రదింపుల సమయంలో ప్రయత్నిస్తామని చెప్పారు. ఎంక్యూ-9బీ డ్రోన్లను కేంద్రం ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన గురువారం ఈ మేరకు స్పందించారు. మొత్తం 31 డ్రోన్లను 307.2 కోట్ల డాలర్లకు అందజేసేందుకు అమెరికా సర్కారు ముందుకొచ్చిందన్నారు. ఆ లెక్కన ఒక్కోదాని ధర 9.9 కోట్ల డాలర్లుగా ఉంటుందని తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవే డ్రోన్లను ఒక్కోదానికి 16.1 కోట్ల డాలర్లు పెట్టి కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. బ్రిటన్ ఒక్కో డ్రోన్‌ను 6.9 కోట్ల డాలర్లు మాత్రమే పెట్టి కొనుగోలు చేసినప్పటికీ.. సెన్సర్లు, ఆయుధాలు, ధ్రువీకరణ వంటివేవీ దానికి అందలేదని వివరించారు. వాస్తవానికి ఆ సెన్లర్లు, ఆయుధాలు, పేలోడ్‌ల విలువే మొత్తం వ్యయంలో 60-70% వరకూ ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా సైతం ఈ డ్రోన్లను సముపార్జించుకునేందుకు ఒక్కోదానికి 11.9 కోట్ల డాలర్లు ముట్టజెప్పిందన్నారు.