* నలుగురు నకిలీ మావోయిస్టుల అరెస్ట్
మావోయిస్టుల పేరుతో శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేసిన నలుగురు నకిలీ మావోయిస్టులను అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. సబ్ డివిజన్ పరిధిలోని పలిమెల పోలీసులు చాకచక్యంగా నిందితులను అదపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. పంకెన గ్రామానికి చెందిన ఎర్రని సోమయ్య హైదరాబాద్ లో పని చేసినప్పుడు పాలకుర్తి మండలంలోని ఎరుకలపల్లి గ్రామానికి చెందిన చిలుముల తిరుపతితో పరిచయం ఏర్పడింది.
* మద్యం తాగుతూ గుండెపోటుతో మృతి
ఇటీవల కాలంలో గుండెపోటుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మద్యం తాగుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడులోని ఓ వైన్ షాప్‌లో సజ్జాపురం గ్రామానికి చెందిన భీమన సైదులు మద్యం సేవిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలాడు. పక్కనే ఉన్నవాళ్లు అతడ్ని రక్షించేందుకు సీపీఆర్ చేయగా.. అప్పటికే అతడు చనిపోయాడు.
* వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసింది: CBI
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. జులై 14 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈరోజు విచారణ సందర్భంగా కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ ప్రస్తావించింది.
* అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంపై విచారణ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కెమికల్స్ అన్లోడ్ చేస్తుండగా కెమికల్స్ ఒత్తిడికి గురైనట్లు సమాచారం. కంటైనరు నిప్పంటుకోవడంతో మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ప్రమాదంలో సాహితీ ఫార్మా యూనిట్ 1 పూర్తిగా కాలిపోయింది.
* మిడ్ మానేరులో ముగ్గురు పిల్లలతో దూకి తల్లి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి మిడ్ మానేరు జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో నలుగురూ మృతిచెందారు. బోయిన్పల్లి మండలం కొదురుపాక నాలుగు వరుసల వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను తల్లి రజిత, పిల్లలు అయాన్(7), అసరజా(5), ఉస్మాన్ (14 నెలలు)గా పోలీసులు గుర్తించారు. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి. కుటుంబకలహాల కారణంగానే పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
* విశాఖలో మరో కిడ్నాప్ కేస్
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఉదాంతం ముగిసి నెల కూడా కాకముందే మరో కుటుంబం కిడ్నాప్ జరిగింది. శ్రీనివాస్ అనే విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే వీరిద్దరిని బలవంతంగా విజయవాడకు తరలించాలనుకున్న దుండగులు.. మార్గమధ్యంలోనే మనసు మార్చుకుని రియల్టర్ భార్య లక్ష్మిను దించేశారు. అందిందే అవకాశం అనుకున్న ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి వచ్చిన మరో కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెంగళూరు నుంచి సామగ్రితో ఓ కంటైనర్ లారీ నాగ్‌పుర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నార్సింగి మండలం కాస్లాపూర్ వద్ద రోడ్డు పక్కనే టైరు పేలి ఆగి ఉన్న మరో కంటైనర్‌ను అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బెంగళూరు నుంచి వస్తున్న లారీలోని నాగరాజు(25), బసవరాజు(24) సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను సీఐ లక్ష్మీరాజు, నార్సింగి ఎస్సై నర్సింగ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.