Politics

నేటి నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం

నేటి నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం

ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే నాణ్యమైన పరిష్కారం చూపేందుకు క్షేత్ర స్థాయిలో నిర్వహించనున్న జగనన్న సురక్ష శిబిరాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి రోజు విడిచి రోజు నెల రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా కార్యక్రమ షెడ్యూల్‌ను ప్రకటించారు. జగనన్న సురక్ష సర్వేలో భాగంగా 50 సచివాలయాల పరిధిలో అధికార బృందాలు ఇంటింటికీ వెళ్లాయని, 41,584 టోకెన్లు నమోదయ్యాయని వివరించారు. వాటిలో 73 శాతం పరిష్కారానికి నోచుకున్నాయని, మిగిలిన వాటికి శిబిరాల్లో పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో ప్రారంభమయ్యే జగనన్న సురక్ష కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను ముందుగానే గుర్తించి శిబిరం రోజు వాటికి సరైన పరిష్కారం చూపుతూ సంబంధిత ధ్రువ పత్రాలు మంజూరు చేయాలని సూచించారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని 11 రకాల సేవలను మిషన్‌ మోడ్‌లో ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. సురక్ష సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి తెలుసుకున్న ప్రజా సమస్యలకు ఈ శిబిరాల వద్ద వాటి పరిష్కారానికి సంబంధించిన సర్టిఫికేట్లను అందజేయాలని సూచించారు.

ప్రతి మండలం నుంచి రెండు బృందాలు…జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం నుంచి రెండు బృందాలు ఆయా సచివాలయాల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఒక్కో మండలంలో రెండు సచివాలయాల పరిధిలో ఎంపిడిఒ అధ్యక్షతన ఒక బృందం, తహశీల్దార్‌ అధ్యక్షతన మరొక బృందం ఈ శిబిరాలు నిర్వహిస్తాయని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను డిఎల్‌డిఒ నిర్మలా దేవి పర్యవేక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు.జగనన్న సురక్ష పేరుతో నిర్వహించే శిబిరాల వద్ద ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించేందుకు నాలుగు ప్రత్యేక డెస్కులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. వాటిలో రిజిస్ట్రేషన్‌ డెస్కు, వెరిఫికేషన్‌ డెస్కు, సర్వీస్‌ రిక్వెస్టు డెస్కు, జగనన్నకు చెబుదాం డెస్కు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.